Pharmexcil director General: 2030కి రూ.10.80 లక్షల కోట్లకు

కొవిడ్‌ పరిణామాలతో దేశ ఔషధ పరిశ్రమ రంగంలో గణనీయ మార్పులు వచ్చాయని ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు.

Updated : 31 May 2024 04:07 IST

దేశ ఔషధ పరిశ్రమపై ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ భాస్కర్‌

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: కొవిడ్‌ పరిణామాలతో దేశ ఔషధ పరిశ్రమ రంగంలో గణనీయ మార్పులు వచ్చాయని ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. 2023-24లో మన దేశం నుంచి 27.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.31 లక్షల కోట్ల) ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 31 బి.డాలర్లు (సుమారు రూ.2.57 లక్షల కోట్లు)గా ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 2030కి ఇది 50 బి.డాలర్ల (సుమారు రూ.4.15 లక్షల కోట్ల)కు చేరొచ్చని పేర్కొన్నారు. అనేక సవాళ్లు ఉన్నా 2023-24 ఎగుమతుల్లో 9.6% వృద్ధి సాధించినట్లు, హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన ఫార్మాలిటికా 10వ సదస్సులో చెప్పారు.  

2030కి పరిశ్రమ టర్నోవర్‌ రెట్టింపు

2023-24లో దేశ ఔషధ పరిశ్రమ మొత్తం వ్యాపారం 65 బి.డాలర్లు (సుమారు రూ.5.40 లక్షల కోట్లు) కాగా, 2030 నాటికి 130 బి.డాలర్ల (సుమారు రూ.10.80 లక్షల కోట్ల)కు, 2047 నాటికి 450 బి.డాలర్ల (సుమారు రూ.37.35 లక్షల కోట్ల)కు చేరుతుందనే అంచనాను వ్యక్తం చేశారు.  

ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌

ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ యేగేష్‌ ముద్రాస్‌ మాట్లాడుతూ.. ఔషధాల ఉత్పత్తులు, ఎగుమతుల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం మూడో స్థానంలో ఉందన్నారు. భారతదేశంలో బల్క్‌ డ్రగ్‌ ఉత్పత్తికి హైదరాబాద్‌ కేంద్రంగా మారిందన్నారు. ఔషధరంగ అభివృద్ధికి అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు ఫార్మాలిటికా మంచి వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు. భారతదేశ ఫార్మా రంగానికి రాజధానిగా హైదరాబాద్‌ ఎదుగుతోందని తుర్కియే కాన్సుల్‌ జనరల్‌ ఓర్హాన్‌ యల్మాన్‌ ఓకాన్‌ పేర్కొన్నారు. జూన్‌ 1 వరకు కొనసాగే ఫార్మాలిటికా 10వ ఎడిషన్‌లో 200 మంది ఎగ్జిబిటర్లు సుమారు 1000 బ్రాండ్ల మెషినరీలు, ప్యాకేజింగ్, ల్యాబ్‌ అనలాటికల్, క్లీన్‌రూమ్‌ ఉత్పత్తులను ప్రదర్శించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇండియన్‌ ఫార్మకోపోయియా కమిషన్‌ సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ గౌరవ్‌ ప్రతాప్‌ సింగ్‌ జదౌన్, ఫార్మాగ్జిల్‌ బోర్డు సభ్యుడు ఏవీపీఎన్‌ చక్రవర్తి, బీడీఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్‌కే అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని