TCS,IIT Mumbai: దేశంలోనే తొలి క్వాంటమ్‌ డైమండ్‌ మైక్రోచిప్‌ ఇమేజర్‌

సెమీకండక్టర్‌ చిప్‌ల కోసం దేశంలోనే తొలి అధునాతన సెన్సింగ్‌ పరికరాన్ని నిర్మించే నిమిత్తం ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఐఐటీ బాంబే మంగళవారం చేతులు కలిపాయి.

Published : 29 May 2024 03:21 IST

నిర్మాణం కోసం టీసీఎస్, ఐఐటీ బాంబే జట్టు

ముంబయి: సెమీకండక్టర్‌ చిప్‌ల కోసం దేశంలోనే తొలి అధునాతన సెన్సింగ్‌ పరికరాన్ని నిర్మించే నిమిత్తం ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఐఐటీ బాంబే మంగళవారం చేతులు కలిపాయి. దీని ద్వారా చిప్‌ వైఫల్యాలను తగ్గించొచ్చని, ఎలక్ట్రానిక్‌ పరికరాల సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని టీసీఎస్‌ పేర్కొంది. దేశంలోనే తొలి క్వాంటమ్‌ డైమండ్‌ మైక్రోచిప్‌ ఇమేజర్‌ను నిర్మించడానికి ఐఐటీ బాంబేతో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని వివరించింది. వచ్చే రెండేళ్లలో పీక్వెస్ట్‌ ల్యాబ్‌లో క్వాంటమ్‌ ఇమేజింగ్‌ ప్లాట్‌ఫారాన్ని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ బాంబే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కస్తూరి సాహాతో కలిసి టీసీఎస్‌ నిపుణులు పనిచేస్తారు.  

ఇలా పనిచేస్తుంది: క్వాంటమ్‌ డైమండ్‌ మైక్రోచిప్‌ ఇమేజర్‌ అనేది ఆసుపత్రుల్లో ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌లాగా అయస్కాంత క్షేత్రాలను చిత్రీకరించగలదు. ఈ సాంకేతికతతో సంప్రదాయ సెన్సింగ్‌ పద్ధతుల్లో ఎదురయ్యే ఇబ్బందులనూ ఇట్టే పసిగట్టేయవచ్చు. 

ఏమిటి ఉపయోగం: ప్రస్తుతం అన్ని ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో సెమీకండక్టర్‌ చిప్‌లు ఉంటున్నాయి. ఈ అధునాతన సెన్సింగ్‌ టూల్‌తో సెమీకండక్టర్‌ చిప్‌ల పరీక్షలో కొత్త స్థాయిలకు చేరొచ్చని, చిప్‌ వైఫల్యాలను తగ్గించొచ్చని ఐఐటీ బాంబే తెలిపింది. కృత్రిమ మేధ/మెషీన్‌ లెర్నింగ్‌ను క్వాంటమ్‌ డైమండ్‌ మైక్రోస్కోపీతో కలగలపడం ద్వారా తయారు చేసే క్వాంటమ్‌ డైమండ్‌ మైక్రోచిప్‌ ఇమేజర్‌ ద్వారా క్వాంటమ్‌ విప్లవాన్ని మరో అడుగు ముందుకు వేయించవచ్చని సాహా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు వివిధ రంగాల్లో మార్పు తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపారు. పలు పరిశ్రమలతో పాటు, సమాజాన్ని సైతం ఈ భాగస్వామ్యం మార్చగలుగుతుందని టీసీఎస్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీఓ) హారిక్‌ విన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు