Future india: భారత్‌ భవిత ఉజ్వలం

పదేళ్ల తరవాత భారత్‌ భవితపై అంచనాను ‘స్థిరత్వం’ నుంచి సానుకూలానికి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ పెంచింది.

Published : 30 May 2024 03:48 IST

‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూలానికి పెంచిన ఎస్‌అండ్‌పీ

దిల్లీ: పదేళ్ల తరవాత భారత్‌ భవితపై అంచనాను ‘స్థిరత్వం’ నుంచి సానుకూలానికి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ పెంచింది. వచ్చే మూడేళ్లలో దేశం బలమైన వృద్ధిని నమోదు చేయొచ్చన్న అంచనాలు, ద్రవ్య స్థిరీకరణకు చేపడుతున్న చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచుతూ సంస్కరణ విధానాలను కొనసాగిస్తే, రెండేళ్లలో రేటింగ్‌ను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం మాత్రం తక్కువ పెట్టుబడుల రేటింగ్‌ అయిన ‘బీబీబీ-’ను ఎస్‌అండ్‌పీ కొనసాగించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా వృద్ధికి తోడ్పడే ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు, మౌలిక సదుపాయాలపై వ్యయ కేటాయింపులను కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.

2014 తర్వాత మళ్లీ పెంపు ఇప్పుడే..  

దేశ రుణ చెల్లింపు సామర్థ్యానికి ప్రామాణికంగా రేటింగ్‌ను మదుపర్లు భావిస్తుంటారు. దేశ రుణ వ్యయాలపై ఇది ప్రభావం చూపుతుంది. 2014లో భారత్‌ భవితపై అంచనాను ‘ప్రతికూలం’ నుంచి ‘స్థిరత్వం’కు ఎస్‌అండ్‌పీ మెరుగు పరచింది. తదుపరిద్రవ్య నిర్వహణ మెరుగుపడటం, బలమైన ఆర్థిక మూలాలు, అధిక విదేశీ మారకపు నిల్వలను చూపుతూ, మన దేశ రేటింగ్‌ పెంచాల్సిందిగా ఆర్థిక శాఖ కూడా రేటింగ్‌ సంస్థలపై ఒత్తిడి తెస్తూనే ఉంది. ప్రభుత్వానికి ఆర్‌బీఐ ఇటీవల రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్ల డివిడెండును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వారంలోనే ఎస్‌అండ్‌పీ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఆర్‌బీఐ నిధుల వల్ల కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు తగ్గే అవకాశం ఉంటుంది. 2025 మార్చి కల్లా ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి, 2026 మార్చి కల్లా 4.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు- ఎస్‌అండ్‌పీ, ఫిచ్, మూడీస్‌లు మనదేశానికి తక్కువ పెట్టుబడి రేటింగ్‌ను కొనసాగిస్తున్నాయి. మూడీస్, ఫిచ్‌లు స్థిరత్వంతో కూడిన అంచనాతో ఉన్నాయి. 


మౌలికంపై అధిక వ్యయాలతో వృద్ధికి ఊతం

ప్రభుత్వం తన వ్యయ కేటాయింపుల్లో అధిక భాగాన్ని మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తుండటం వల్ల, దేశం అధిక వృద్ధి దిశగా వెళ్లే మార్గంలో అవరోధాలు తగ్గుతున్నాయని ఎస్‌అండ్‌పీ అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధి, ఆ దేశ రుణ సామర్థ్యంపై సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తుందని పేర్కొంది. ద్రవ్య, పరపతి విధాన నిర్ణయాల విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తుండటం వల్ల ప్రభుత్వ రుణ స్థాయిలు, వడ్డీ భారం దిగివచ్చేందుకు దోహదం చేస్తున్నాయని విశ్లేషించింది. ఈ అంశాలన్నీ రాబోయే 24 నెలల్లో దేశ రేటింగ్‌ పెంపునకు ఉపకరించే అవకాశం ఉందని తెలిపింది. కొవిడ్‌-19 పరిణామాల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ గణనీయ స్థాయిలో పుంజుకుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఈ ఏడాదికి భారత జీడీపీ వృద్ధిని 6.8 శాతంగా సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, వర్థమాన దేశాలతో పోలిస్తే ఇది మెరుగైన వృద్ధి రేటుగా పేర్కొంది. గత మూడు సంవత్సరాల్లో భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున ఏడాదికి 8.1 శాతమని, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే ఇది అత్యధికమని తెలిపింది. మధ్యకాలంలోనే భారత్‌ పురోగతి ఇలాగే కొనసాగొచ్చని రాబోయే మూడేళ్లలో సగటున 7% వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిణామం భారత జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గేందుకు తోడ్పడుతుందని, అయితే ద్రవ్యలోటు మాత్రం ఎక్కువగానే కొనసాగుతుందని వివరించింది. గత 4-5 ఏళ్లలో ప్రభుత్వ వ్యయాల్లో నాణ్యత మెరుగయ్యిందని తెలిపింది. ప్రభుత్వ వ్యయాలు, వినియోగంలో వృద్ధి వచ్చే 3-4 ఏళ్లలో బలమైన వృద్ధికి దారి చూపుతాయని పేర్కొంది. 


6 బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలపైనా

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఇండియన్‌ బ్యాంకులపై భవిష్యత్‌ అంచనాలను ‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూలం’కు పెంచుతూ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌ గ్రిడ్‌పై రేటింగ్‌ అంచనాలను కూడా ‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూలం’కు మార్చింది. ఈ సంస్థలకు ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని