Gold: మార్చి త్రైమాసికంలో బంగారానికి గణనీయంగా తగ్గిన డిమాండ్‌

Gold: రికార్డు స్థాయి ధరలు, ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో బంగారానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో డిమాండ్‌ తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది.

Published : 05 May 2023 23:23 IST

ముంబయి: భారత్‌లో జనవరి- మార్చి త్రైమాసికంలో బంగారానికి (Gold) డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. మూడు నెలల వ్యవధిలో పసిడి వినియోగం 17 శాతం తగ్గి 112.5 టన్నులకు చేరింది. రికార్డు స్థాయి ధరలు, ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు ‘ప్రపంచ స్వర్ణ మండలి (WGC)’ తెలిపింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో బంగారం (Gold) డిమాండ్‌ 135.5 టన్నులుగా నమోదైంది.

క్రితం ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో బంగారు (Gold) ఆభరణాల డిమాండ్‌ 94.2 టన్నులుగా నమోదైంది. ఈ ఏడాది అది 78 టన్నులకు పడిపోయింది. 2010 తర్వాత (కరోనా వ్యవధిని మినహాయించి) పసిడి ఆభరణాల (Gold Jewellery) డిమాండ్‌ 100 టన్నుల దిగువకు చేరడం ఇది నాలుగోసారని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సోమసుందరం వెల్లడించారు. రానున్న రోజుల్లో ధరలు దిగొచ్చే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో సామాన్యులు కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారని తెలిపారు.

అమెరికాలో వడ్డీరేట్ల పెంపు, డాలర్‌ బలపడడం.. ఫలితంగా రూపాయి పతనం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ.60,000 ఎగువకు చేరింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 19 శాతం అధికం. విలువ పరంగా చూస్తే జనవరి- మార్చి త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ తొమ్మిది శాతం తగ్గి రూ.56,220 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఈ విలువ రూ.61,540 కోట్లుగా నమోదైంది. ఆభరణాల డిమాండ్‌ సైతం 9 శాతం కుంగి రూ.39,000 కోట్లకు చేరింది. పెట్టుబడుల కోసం కొనే బంగారు కడ్డీలు, నాణేల గిరాకీ కూడా 17 శాతం పడిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని