Air taxi: 2026 నాటికి ఎయిర్‌ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!

దేశంలో 2026 నాటికి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.

Updated : 20 Apr 2024 01:17 IST

Air taxi | దిల్లీ: ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, అమెరికాకు చెందిన ఆర్చర్‌ ఏవియేషన్‌ సంయుక్తంగా దేశంలో ఎయిర్‌ ట్యాక్సీ (Air taxi) సేవలను ప్రారంభించనున్నాయి. 2026 నాటికి ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు గతేడాది అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఆర్చర్‌ ఏవియేషన్‌ 200 ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (eVTOL) ఎయిర్‌క్రాఫ్ట్‌లను సప్లయ్‌ చేయనుంది.

ఈ ఎయిర్‌ ట్యాక్సీల్లో పైలట్‌తో పాటు నలుగురు ప్యాసింజర్లు కూర్చోవచ్చు. హెలికాప్టర్‌ మాదిరిగానే ఇదీ పనిచేస్తుంది. కాకపోతే అతి తక్కువ శబ్దంతో ఇవి ప్రయాణిస్తాయి. 200 ఎయిర్‌ ట్యాక్సీల ఖరీదు సుమారు 1 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. తొలి దశలో దిల్లీతో పాటు ముంబయి, బెంగళూరులో కూడా ఈ సేవలను ప్రారంభించాలని ఇండిగో భావిస్తోంది. అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి వచ్చే ఏడాదికి సర్టిఫికేషన్‌ పొందే అవకాశం ఉందని, ఆపై డీజీసీఏ సర్టిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆర్చర్‌ ఏవియేషన్‌ వస్థాపకుడు, సీఈఓ ఆడం గోల్డ్‌ స్టెయిన్‌ పేర్కొన్నారు.

27 కిలోమీటర్లు.. 7 నిమిషాలు 

దేశ రాజధాని దిల్లీలో కన్నాట్‌ ప్లేస్‌ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌కు కేవలం ఏడు నిమిషాల్లోనే చేరుకోవచ్చని ఆర్చర్‌ ఏవియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఇందుకు రూ.2-3వేలు ఖర్చవుతుందన్నారు. 27 కిలోమీటర్లు దూరానికి కారులో అయితే సుమారు 90 నిమిషాలు పడుతుందని, అందుకు ఖర్చు కూడా సుమారు రూ.1500 అవుతుందని తెలిపారు. ఈ విమానంలో ఆరు బ్యాటరీలు ఉంటాయని, 30-40 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ చేయొచ్చని పేర్కొన్నారు. ఒక నిమిషం ఛార్జింగ్‌తో ఒక నిమిషం పాటు ప్రయాణించొచ్చని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని