IndiGo: ఇండిగో విమానాల్లో ఇక బిజినెస్‌ క్లాస్‌

IndiGo: ఇండిగో విమానాల్లో త్వరలో ప్రీమియం క్లాస్‌ ప్రయాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది చివరి నాటికి బిజినెస్‌ క్లాస్‌ సేవలు అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Published : 23 May 2024 18:54 IST

దిల్లీ: దేశీయ బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరికి తమ విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌ (Business Class) సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాటి మార్కెట్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. తొలుత రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు సంస్థ (IndiGo) తెలిపింది.

బిజినెస్‌ క్లాస్‌ సేవల ప్రారంభ తేదీ, ఆఫర్లు, ఏయే మార్గాల్లో అందుబాటులో ఉండనున్నాయనే సమాచారాన్ని.. ఈ ఏడాది ఆగస్టులో జరిగే సంస్థ 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో వెల్లడిస్తామని పేర్కొంది. ప్రయాణికులకు నిరంతరం వినూత్న సేవలు అందించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు.

‘‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించేందుకు భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నవ భారత్‌లో పౌరులకు మరింత మెరుగైన ప్రయాణ అవకాశాలు కల్పించడం మేం గర్వంగా భావిస్తాం. ఈ కొత్త సేవలను ప్రారంభించేందుకు మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని సీఈవో హర్షం వ్యక్తంచేశారు.

ప్రాంతీయ మార్గాల్లో సేవలను విస్తరించే లక్ష్యంతో కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఇటీవల ఇండిగో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 3 విమాన తయారీ సంస్థలు ఏటీఆర్‌, ఎంబ్రాయిర్‌, ఎయిర్‌బస్‌లతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దేశీయ విమానయాన విపణిలో ఇండిగోకే 60శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఈ ఏడాది కంపెనీ మార్కెట్‌ విలువ కూడా రూ.1.76 లక్షల కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని