Infosys CEO salary: పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. గతేడాది కంటే ₹10 కోట్లు అదనం

Infosys CEO salary: 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ 66.2 కోట్లు వేతనంగా అందుకున్నారు.

Published : 03 Jun 2024 18:57 IST

Infosys CEO salary | ముంబయి: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సలీల్‌ పరేఖ్‌ వార్షిక వేతనం (Infosys CEO salary) పెరిగింది. 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.66.2 కోట్లు వేతనంగా అందుకున్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.56.4 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 17.3 శాతం పెరగడం గమనార్హం. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.71.02 కోట్లుగా ఉంది.

సలీల్‌ వేతనంలో ఫిక్స్‌డ్‌ పే, వేరియబుల్‌ పే, రిటైరల్‌ బెన్‌ఫిట్స్‌తో పాటు ఆర్థిక సంవత్సరంలో వినియోగించుకున్న స్టాక్‌ ఇన్సెంటివ్స్‌ విలువ కలగలిపి ఉంటాయి. పరేఖ్‌ ఫిక్స్‌డ్‌ వేతనం రూ.7.12 కోట్ల నుంచి రూ.7.47 కోట్లకు పెరగ్గా.. బోనస్‌ రూపంలో ఆయన గత ఆర్థిక సంవత్సరంలో 19.75 కోట్లు అందుకున్నారు. 2,58,636 రెస్ట్రిక్ట్‌డ్‌ స్టాక్‌ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ.39.03 కోట్లు వచ్చింది. మరోవైపు ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌ సీఈఓ,  ఎండీ కృతివాసన్‌ రూ.25.2 కోట్లు వేతనంగా అందుకోగా.. విప్రో సీఈఓ, ఎండీ శ్రీనివాస్‌ పల్లియా రూ.58.4 కోట్లు పొందారు. మరోవైపు ఇన్ఫోసిస్‌ నాన్‌ - ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న నందన్‌ నీలేకని గత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి వేతనమూ తీసుకోకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని