Infosys results: ఇన్ఫీ లాభం 30 శాతం జంప్‌.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్‌

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 30 శాతం మేర పెరిగింది.

Published : 18 Apr 2024 18:47 IST

Infosys Results | దిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను (Infosys Results) ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.7,969 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.6,128 కోట్లతో పోలిస్తే 30 శాతం మేర వృద్ధి నమోదైంది. సమీక్ష త్రైమాసికంలో ఆదాయం రూ.37,441 కోట్ల నుంచి ఒక శాతం పెరిగి రూ.37,923 కోట్లుగా నమోదైనట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.24,095 కోట్ల నుంచి 8.9 శాతం వృద్ధితో రూ.26,233 కోట్లకు పెరిగింది. ఆదాయం 4.7 శాతం వృద్ధితో రూ.1,53,670 కోట్లుగా నమోదైంది. ఈసందర్భంగా భవిష్యత్‌ ఆదాయ వృద్ధి అంచనాలను సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల వద్ద 1-3 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.20 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.8 చొప్పున స్పెషల్‌ డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. జర్మనీకి చెందిన ఇన్‌-టెక్‌లో నూరు శాతం వాటాను 450 మిలియన్‌ యూరోలకు కొనుగోలు చేయనున్నట్లు ఈసందర్భంగా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫీ షేరు బీఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ.1420.5 వద్ద ముగిసింది.

గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో మొత్తం 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. ప్రస్తుతం 3.17 లక్షల మంది పని చేస్తున్నారు. మార్చి త్రైమాసికంలో 5,423 మంది ఉద్యోగులు కంపెనీని వీడారు. డిమాండ్‌ను బట్టి నియామకాలు చేపడతామని సీఈఓ సలీల్‌ పరేఖ్‌ ఫలితాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని