Union Budget 2024: సౌర విద్యుత్తు.. ఇక మధ్య తరగతి ఆదాయ వనరు: నిర్మలా సీతారామన్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన సాధారణ, మధ్యతరగతి ప్రజలకు ఆదాయ వనరుగా మారుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. సౌర విద్యుత్తు రంగానికి రూ.7,327 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

Updated : 01 Feb 2024 19:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా కోటి ఇళ్లు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) బడ్జెట్‌ ప్రసంగంలో (Union Budget 2024) పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ (pradhanmantri suryoday yojana) పథకం కింద రూఫ్‌ టాప్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా దీనిని సాకారం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా బడ్జెట్‌లో సౌర విద్యుత్తు రంగానికి రూ.7,327 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.4,979 కోట్ల కంటే దాదాపు 48 శాతం ఎక్కువ. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ‘రూఫ్‌ టాప్‌ సోలార్‌’ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రి సభకు వివరించారు. 

సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు తమ ఇళ్లపై ఏర్పాటు చేసే సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును గృహావసరాలకు వినియోగించుకోవడమే కాకుండా, మిగిలిన విద్యుత్తును డిస్కంలకు విక్రయించుకునే వీలుందని సీతారామన్‌ చెప్పారు. తద్వారా ప్రతి కుటుంబం ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చన్నారు. గత కొంతకాలంగా విద్యుత్తు వాహనాలకు గిరాకీ ఏర్పడటంతో సోలార్‌ పవర్‌తో ఛార్జింగ్‌ పెట్టేలా కొత్త స్టేషన్లు వస్తాయన్నారు. వాటి వల్ల ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆత్మనిర్భర్‌ భారత్‌కు అనుగుణంగా ఆర్థిక వృద్ధిని సాధించేందుకు దోహదం చేస్తుందని సీతారామన్‌ అన్నారు.

సామర్థ్యం, నైపుణ్యం, నియంత్రణ తదితర అంశాలను బేరీజు వేసుకుంటూ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సున్నా కర్బన ఉద్గారాలే లక్ష్యంగా విండ్‌ ఎనర్జీ ఉత్పత్తికి వీజీఎఫ్‌ (వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌) విధానాన్ని అవలంబించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా విద్యుత్తు ఉత్పత్తి సంస్థలను నిర్వహిస్తాయి. 2030 నాటికి 500 గిగా వాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించడంలో సోలార్‌ పవర్‌ కీలక పాత్ర పోషిస్తుందని సీతారామన్‌ అన్నారు.  వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు దేశం చేస్తున్న ప్రయత్నాల్లో సోలార్‌ పవర్‌ ఉత్పత్తి కీలక అంశమని పేర్కొన్నారు.

అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కోటి గృహాలకు సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో దీనిని తీసుకొచ్చినట్లు చెప్పారు. సౌర శక్తిని వినియోగించుకోవడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల విద్యుత్తు బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన దిశగా ముందడుగు వేస్తుందని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని