Bombay Stock Exchange: మదుపర్ల సంపద@ 5లక్షల కోట్లు

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బీఎస్‌ఈలో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మొదటిసారిగా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.

Published : 22 May 2024 02:08 IST

6 నెలల్లోపే పెరిగిన లక్ష కోట్ల డాలర్ల సంపద

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బీఎస్‌ఈలో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మొదటిసారిగా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రికార్డు గరిష్ఠమైన రూ.414.62 లక్షల కోట్లుగా నమోదైంది. సెన్సెక్స్‌ జీవనకాల గరిష్ఠానికి కంటే 1170 పాయింట్లు దిగువనే ఉన్నప్పటికీ.. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు తాజా గరిష్ఠాలకు చేరాయి.

  • నీ 2023 నవంబరు 29న బీఎస్‌ఈ మొత్తం మార్కెట్‌ విలువ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల)కు చేరింది. అక్కడ నుంచి ఆరు నెలల్లోపే 5 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని తాకింది. 
  • నీ బ్లూమ్‌బర్గ్‌ ప్రకారం.. 2024లో ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్‌ విలువ దాదాపు 12% పెరిగింది. 

బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో: బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో మంగళవారం సెన్సెక్స్‌ స్వల్పంగా నష్టపోగా, నిఫ్టీ లాభపడింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు పెరిగి 83.31 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.55% నష్టంతో 83.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

  • సెన్సెక్స్‌ ఉదయం 73,842.96 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం లాభాల్లోకి వచ్చి, 74,189.19 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో మళ్లీ నష్టాల్లోకి జారుకున్న సూచీ, 52.63 పాయింట్లు తగ్గి 73,953.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.05 పాయింట్లు పెరిగి 22,529.05 దగ్గర స్థిరపడింది. 
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 నష్టపోయాయి. నెస్లే   1.62%, మారుతీ 1.06%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌    0.85%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.84%, హెచ్‌యూఎల్‌ 0.74% డీలాపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3.68%, పవర్‌గ్రిడ్‌ 2.71%, ఎన్‌టీపీసీ 1.50%, టెక్‌ మహీంద్రా 1.39%, ఏషియన్‌ పెయింట్స్‌  1.20% లాభపడ్డాయి.
  • రికార్డు గరిష్ఠానికి టాటా స్టీల్‌ షేరు: ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో టాటా స్టీల్‌ షేరు రికార్డు గరిష్ఠాలకు చేరింది. ఇంట్రాడేలో రూ.175.20 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకిన షేరు, చివరకు 3.81% లాభంతో రూ.174.30 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2.17 లక్షల కోట్లుగా నమోదైంది.
  • ఆఫిస్‌ స్పేస్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై 27న ప్రారంభమైంది. ధరల శ్రేణిగా   రూ.363- 383ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.599 కోట్లు సమీకరించనుంది.            
  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో తమ రుణ పంపిణీ రికార్డు స్థాయిలో 18.6% పెరిగి రూ.61,703.26 కోట్లకు చేరినట్లు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ ప్రకటించింది. 
  • ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవికి ఈనెల 22న జరగాల్సిన అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూల ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎఫ్‌ఎస్‌ఐబీ వెల్లడించింది.  
  • మల్టిపుల్‌ మైలోమా (బోన్‌ మెటాస్టాసెస్‌) అనే క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలో వినియోగించే డెనోసుమ్యాబ్‌ అనే బయోసిమిలర్‌ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, యూఎస్‌కు చెందిన అల్వోటెక్‌ అనే బయోటెక్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం యూఎస్‌తో పాటు, యూకే, కొన్ని ఐరోపా దేశాల్లో ఈ మందును విక్రయించే అవకాశం డాక్టర్‌ రెడ్డీస్‌కు లభిస్తోంది.
  • డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అనుబంధ కంపెనీ అయిన అరిజీన్‌ డిస్కవరీ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు జీఎస్‌టీ నోటీసు జారీ అయింది. రూ.64.94 లక్షల జీఎస్‌టీ పెనాల్టీ చెల్లించాలని ఆదేశిస్తూ, టీజీఎస్‌టీ, సీజీఎస్‌టీ చట్టాల్లోని సెక్షన్‌ - 73 కింద మాదాపూర్‌ (హైదరాబాద్‌) లోని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఈ నోటీసు ఇచ్చారు. 

నేటి బోర్డు సమావేశాలు: సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్, గ్రాసిమ్, మ్యాక్స్‌ హెల్త్‌కేర్, టొరెంట్‌ పవర్, నైకా, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్, మెట్రో బ్రాండ్స్, గ్లాండ్‌ ఫార్మా, పేటీఎం, రామ్‌కో సిమెంట్స్, అవంతీ ఫీడ్స్, ఇండిగో పెయింట్స్, కావేరీ సీడ్, పెన్నార్‌ ఇండస్ట్రీస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని