Stock Market Update: దూసుకెళ్తున్న సూచీలు.. మదుపర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం

Stock Market Update: రెండు ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌ ఒక శాతానికి పైగా లాభపడి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి.

Updated : 04 Dec 2023 14:01 IST

దిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం దూసుకెళ్తున్నాయి. మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపొందడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయనే అంచనాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. దీంతో మదుపర్ల సంపద ఈ ఒక్కరోజే దాదాపు రూ.ఐదు లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం. 

ఉదయమే భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు (Stock Market) అదే జోరును కొనసాగిస్తూ దూసుకెళ్తున్నాయి. రెండు ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌ ఒక శాతానికి పైగా లాభపడి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఎన్నికల ఫలితాలతో పాటు భారీ జీఎస్టీ వసూళ్లు, సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బలమైన జీడీపీ వృద్ధి రేటు, నవంబర్‌ వాహన విక్రయాల్లో గణనీయ వృద్ధి, బలమైన తయారీ కార్యకలాపాల వంటి అంశాలు సూచీల లాభాలకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ ఓ దశలో 1,100 పాయింట్లకు పైగా పెరిగి 68,634 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 20,619.70 దగ్గర రికార్డు స్థాయికి చేరింది. 

మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఈ ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.343 లక్షల కోట్లకు చేరింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ విలువ రూ.14 లక్షల కోట్లకు పైగా ఎగబాకడం విశేషం. బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఇటీవలే నాలుగు లక్షల కోట్ల డాలర్ల కీలక మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల విలువ సైతం శుక్రవారం ఈ కీలక మైలురాయి దాటింది. 

‘‘మూడు కీలక రాష్ట్రాల్లో భాజపా గెలవడం మార్కెట్ల (Stock Market) బుల్లిష్‌ సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ లోక్‌సభలో భాజపా అత్యధిక స్థానాలను నిలబెట్టుకోవడానికి బలం చేకూరింది. ఇది మార్కెట్ల సెంటిమెంట్‌ను పెంచింది’’ అని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ నోట్‌ అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని