Corporate FD: కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సురక్షితమేనా?

పెట్టుబడికి రక్షణ.. రాబడికి హామీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే. స్వల్పకాలం నుంచి దీర్ఘకాలం వరకూ వివిధ వ్యవధులకు ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే, గత ..

Updated : 21 Aug 2021 11:59 IST

బ్యాంక్‌ ఎఫ్‌డీలతో పోలిస్తే తేడా ఏంటి?

పెట్టుబడికి రక్షణ.. రాబడికి హామీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే. స్వల్పకాలం నుంచి దీర్ఘకాలం వరకూ వివిధ వ్యవధులకు ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే, గత కొన్నాళ్లుగా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై గణనీయంగా వడ్డీని తగ్గించాయి. దీంతో వీటిపైనే ఆధారపడిన వారికి ఆదాయం తగ్గిపోయింది. మరోవైపు కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇప్పుడు ఆకర్షణీయంగా మారాయి. మరి, వీటిలో మదుపు చేయడం సురక్షితమేనా? తెలుసుకుందాం..

బ్యాంకు డిపాజిట్ల మాదిరిగానే.. కార్పొరేట్‌ సంస్థలు, కంపెనీలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ప్రజల నుంచి వివిధ వ్యవధులకు డిపాజిట్లను సేకరిస్తుంటాయి. వీటినే కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా పిలుస్తారు. బ్యాంకు ఎఫ్‌డీల్లాగానే వీటికీ నిర్ణీత వ్యవధి, రాబడి హామీ ఉంటుంది. బ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే ఇవి కాస్త అధిక రాబడిని ఇస్తుంటాయి.

ఇవే ఎందుకు?

స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేయాలనుకునే వారికి కార్పొరేట్‌ ఎఫ్‌డీలతో బ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే కనీసం 1-4 శాతం వరకూ వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. ఇందులో వ్యవధులను బట్టి 4 నుంచి 9శాతం వరకూ వడ్డీనిచ్చేవీ ఉన్నాయి. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే ఇందులో వ్యవధి కూడా తక్కువే. సీనియర్‌ సిటిజన్లకు ఇందులో 0.5శాతం వరకూ అధిక వడ్డీ లభిస్తుంది.

సురక్షితమేనా?

కార్పొరేట్‌ ఎఫ్‌డీలను ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. బ్యాంకుల విషయంలో రూ.5లక్షల వరకూ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పథకం(డీఐసీజీసీ)లో భాగంగా రక్షణ లభిస్తుంది. కార్పొరేట్‌ ఎఫ్‌డీలకు ఇది వర్తించదు. కాబట్టి, వీటిలో కాస్త నష్టభయం ఉంటుంది. ఒకవేళ ఈ కార్పొరేట్లు దివాలా తీస్తే డిపాజిట్‌ వెనక్కి రావడం అంత తేలిక కాదు. వీటిని ఎంచుకునేటప్పుడు పూర్తిగా రేటింగ్‌ల మీదే ఆధారపడాల్సి వస్తుంది.

కార్పొరేట్‌ ఎఫ్‌డీలపై అధిక వడ్డీ వస్తుంది అంటే.. నష్టభయాన్ని అంగీకరించాల్సిందే. ఏఏ, ఏఏఏ రేటింగ్‌ ఉన్న సంస్థలలో డిపాజిట్‌ చేయడం కాస్త సురక్షితం. నష్టభయం భరించే సామర్థ్యం ఉండి, అధిక రాబడి వస్తే చాలనుకునే వారు వీటిని పరిశీలించవచ్చు. అత్యవసరాల్లో ఈ ఎఫ్‌డీల నుంచి 75శాతం వరకూ రుణం తీసుకునే అవకాశమూ వీటిల్లో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని