Gold: బంగారం ఇప్పుడు కొనొచ్చా?

ఇటీవల వరకు కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు కొంతమేర దిగి వచ్చాయి. ఈ లోహ ధరలకు అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్‌ విలువే కీలకం. 

Updated : 09 Mar 2023 07:53 IST

గరిష్ఠాల నుంచి 10 గ్రాములకు రూ.4000 తగ్గింది
వెండి కిలోకు రూ.8500 పతనం
డాలర్‌ విలువ, అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ఈనాడు వాణిజ్య విభాగం

ఇటీవల వరకు కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు కొంతమేర దిగి వచ్చాయి. ఈ లోహ ధరలకు అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్‌ విలువే కీలకం. దేశీయంగా కూడా ఏప్రిల్‌లో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేనందున, గిరాకీ తక్కువగానే ఉందని విక్రేతలు చెబుతున్నారు. పుత్తడి ధర బాగా పెరిగిన నేపథ్యంలో పాత ఆభరణాలు మార్చుకుని, కొత్తవి తీసుకోవడం పెరుగుతోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) కూడా ఇటీవలి నివేదికలో పేర్కొనడం గమనార్హం. ధరలు ఇంకా తగ్గుతాయా, వేచి చూడొచ్చా అని పలువురు ఆలోచిస్తున్నారు.

బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని గరిష్ఠస్థాయులకు చేరడం, మన దేశంలో మహిళలకు శరాఘాతమే అయ్యింది. ఏ శుభకార్యమైనా కొత్త ఆభరణం కొనుగోలు చేసుకోవడంలో వారికి ఉండే ఆసక్తే ఇందుకు కారణం. పాశ్చాత్య దేశాల్లో బంగారం, వెండిపై ఆసక్తి ..పెట్టుబడికి మాత్రమే ఎక్కువగా పరిమితం అవుతుంది. మనం షేర్లపై పెట్టుబడి పెట్టినట్లు, బంగారం-వెండి ఫ్యూచర్‌ కాంట్రాక్టులు కొనుగోలు చేసి, లాభానికి విక్రయించడం అక్కడ ఎక్కువ. లోహ రూపంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగేది భారత్‌, చైనాల్లోనే.

అంతర్జాతీయంగా తక్కువగానే ఉన్నా

అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర గతేడాది మార్చిలో 2052 డాలర్లు పలికితే, ఇప్పుడు 1815 డాలర్లు మాత్రమే ఉంది. అప్పట్లో డాలర్‌ విలువ రూ.76 కాగా, ఇప్పుడు రూ.82 దగ్గర ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔన్సు బంగారం 1952 డాలర్లు పలుకగా, దేశీయంగా 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర రూ.60,900కు చేరింది. ఫిబ్రవరి నుంచి చూస్తే అంతర్జాతీయంగా ఔన్సు ధర 137 డాలర్లు తగ్గితే, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.4000 తగ్గి, రూ.56900కు చేరింది. అదేవిధంగా కిలో వెండి ధర కూడా రూ.72,000 నుంచి రూ.8500 తగ్గి రూ.63,500 స్థాయికి దిగి వచ్చింది.

ఇంకా తగ్గుతుంది

బంగారం ధర గరిష్ఠస్థాయులకు చేరినప్పుడు కూడా చిన్న పట్టణాల్లో అమ్మకం, ఆ ధర మేర జరగలేదని బులియన్‌ అసోసియేషన్‌ ప్రముఖులు తెలిపారు. అప్పట్లో గ్రాముకు రూ.270 చొప్పున తగ్గించే పలు ప్రాంతాల్లో అమ్మకాలు జరిపినట్లు వివరించారు. ఇప్పుడు కూడా ధర మరింత తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా కూడా ఔన్సు బంగారం ధర మరో  40-50 డాలర్లు తగ్గొచ్చని, ఇందువల్ల దేశీయ విపణిలోనూ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55,000 స్థాయికి, వెండి కిలో రూ.61,000 దరిదాపులకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ముంబయి బులియన్‌ వర్తకులు కూడా ఇదే అంచనాతో ఉన్నారని తెలిపారు. అందువల్ల ధరలను నిత్యం గమనిస్తూ, తాము అనుకున్న ధర వచ్చినప్పుడు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

బిల్లు లేకుండా కొనడం ప్రమాదకరమే

పసిడి ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, బిల్లు లేకుండా అయితే కొంత తక్కువకే ఆభరణం లభిస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే పదుల సంఖ్యలో షోరూమ్‌లను నిర్వహించే కార్పొరేట్‌ సంస్థలేవీ బిల్లు లేకుండా అమ్మకాలు జరపవు. స్థానికంగా ఉన్న దుకాణదారులు మాత్రమే బిల్లు లేకుండా ఆభరణాలు విక్రయించే అవకాశం ఉంది. అయితే బిల్లు లేకపోయినా, బంగారం ధరలో వ్యాపారులు తగ్గించగలిగేది జీఎస్‌టీ రూపేణ వసూలు చేసే 3 శాతం మాత్రమే. అంటే రూ.లక్షకు రూ.3000 మాత్రమే ఆదా అవుతుంది. కానీ బిల్లు లేకుండా కొంటే ఆభరణంలోని బంగారం స్వచ్ఛతకు భద్రత ఏమీ ఉండదు. సదరు దుకాణదారుపై నమ్మకంతో కొనుగోలు చేసినా, క్యారెట్‌ మీటరుతో పరీక్షించుకుంటేనే ఉత్తమం. లేకపోతే 22 క్యారెట్లకు (916 స్వచ్ఛత) బదులు తక్కువ నాణ్యత ఉండే బంగారాన్ని అంటగట్టే ప్రమాదముంది. ఇందువల్ల బిల్లు లేకుండా కొనుగోలు చేసినందున, పొందే లాభం కంటే నష్టపోయే మొత్తమే అధికంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని