Tesla: భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?

Tesla: భారత్‌లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం!

Updated : 24 Apr 2024 11:58 IST

వాషింగ్టన్‌: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) భారత పర్యటన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆయన రాక, దేశంలో ఆ కంపెనీ పెట్టుబడులు దాదాపు ఖాయమనే అనుకున్నారంతా. షోరూమ్‌ల కోసం స్థలాలు కూడా అన్వేషిస్తున్నారని వార్తలు రావటంతో త్వరలో మన రోడ్లపై టెస్లా (Tesla) కార్లు పరుగెడతాయనుకున్నారు. కానీ, మంగళవారం టెస్లా చేసిన ఓ కీలక ప్రకటనతో కంపెనీ భారత ప్రణాళికల్లో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.

తయారీ సామర్థ్యం పెంపు..

త్వరలో తమ తయారీ సామర్థ్యాన్ని 50 శాతం పెంచనున్నట్లు టెస్లా ప్రకటించింది. కొత్త తయారీ లైన్ల ఏర్పాటు కంటే ముందే దీన్ని చేపడతామని తెలిపింది. ప్రస్తుతం టెస్లా వార్షిక తయారీ సామర్థ్యం 30 లక్షల యూనిట్లుగా ఉంది. తాజాగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గిస్తూనే తయారీని పెంచడానికి ఇదే సరైన నిర్ణయంగా తాము భావిస్తున్నామని కంపెనీ తెలిపింది. టెస్లా నిర్ణయంపై స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లు సానుకూలంగా స్పందించారు. ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత ఫ్యూచర్‌ మార్కెట్‌లో టెస్లా షేర్ల విలువ 12 శాతం పెరిగింది. తొలి త్రైమాసికం ఫలితాల్లో కంపెనీ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ షేర్లు పాజిటివ్‌గా ఉండడం గమనార్హం.

భారత ప్రణాళికలు పక్కకు..

కొత్త తయారీ లైన్ల ఏర్పాటు కంటే ముందు.. ఇప్పటికే ఉన్నవాటి సామర్థ్యం పెంచుతామని టెస్లా ప్రకటించటంతో భారత్‌లో పెట్టుబడులు ఇప్పట్లో ఉండకపోవచ్చుననే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇండియాతో పాటు మెక్సికో ప్రణాళికలను సైతం టెస్లా తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన భారత పర్యటనను చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మంగళవారం టెస్లాను ప్రశ్నించగా.. ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

పోటీ తట్టుకునేలా..

అతిపెద్ద మార్కెట్లయిన చైనా, అమెరికాలో టెస్లా కార్లకు గిరాకీ గణనీయంగా పడిపోయింది. అలాగే చైనా కంపెనీల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. దీంతో టెస్లా కొత్త పంథా అనుసరించేందుకు సిద్ధమైంది. 25,000 డాలర్లలోపు ధరతో కార్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిని 2025 ద్వితీయార్ధంలో అందుబాటులోకి తీసుకొస్తామని స్వయంగా మస్క్‌ జనవరిలో ప్రకటించారు. టెస్లా తర్వాత దశ వృద్ధికి ఇది దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగానే తాజాగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ నెల 21, 22 తేదీల్లో భారత పర్యటనకు ఎలాన్‌ మస్క్‌ రావాల్సింది. కానీ, వివిధ కారణాల వల్ల దాన్ని ఏడాది చివరకు వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. భారత్‌లోకి టెస్లా ప్రవేశంపై సుదీర్ఘ కాలంగా ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. మస్క్‌ రాకతో వాటన్నింటికీ తెరపడతాయని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. మరోవైపు అమెరికా సహా చైనా మార్కెట్‌లో కార్ల ధరలను కంపెనీ ఇటీవల గణనీయంగా తగ్గించింది. పోటీని తట్టుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని