ITC: ఐటీసీ లాభం రూ.5,191 కోట్లు

ఐటీసీ, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,190.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,242.59 కోట్లతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువ.

Published : 24 May 2024 03:09 IST

తుది డివిడెండ్‌ 750%

దిల్లీ: ఐటీసీ, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,190.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,242.59 కోట్లతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువ. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.19,058.29 కోట్ల నుంచి 2% పెరిగి రూ.19,446.49 కోట్లకు చేరింది. ఉత్పత్తుల విక్రయం ద్వారా స్థూల ఆదాయం రూ.18,779.18 కోట్ల నుంచి 2.61% పెరిగి రూ.19,291.40 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలూ 3% అధికమై రూ.13,294.30 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం 2.35% పెరిగి రూ.20,130.32 కోట్లకు చేరింది. ‘మార్చి త్రైమాసికంలో వినియోగ గిరాకీ స్తబ్దుగా ఉంది. ప్రస్తుతం స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగవుతుండటం, కొన్ని త్రైమాసికాల తర్వాత గ్రామీణ గిరాకీ పుంజుకుంటుండటం, సాధారణ వర్షపాతం అంచనాల వల్ల సమీప కాలంలో వినియోగ గిరాకీ రాణిస్తుంద’ని ఐటీసీ అంచనా వేసింది.

  • ఎఫ్‌ఎంసీజీ విభాగ ఆదాయం (సిగరెట్‌ వ్యాపారంతో కలిపి) రూ.13,033.43 కోట్ల నుంచి 7.4% పెరిగి రూ.13,996.86 కోట్లకు చేరింది. ఇందులో సిగరెట్‌ వ్యాపార ఆదాయం రూ.8,082.26 కోట్ల నుంచి 7.5% వృద్ధితో రూ.8,688.92 కోట్లుగా నమోదైంది.
  • ఎఫ్‌ఎంసీజీ యేతర విభాగ ఆదాయం రూ.4,951.17 కోట్ల నుంచి 7.61% పెరిగి రూ.5,307.94 కోట్లకు చేరింది. ఐటీసీ హోటల్స్‌ విభాగ ఆదాయం రూ.808.72 కోట్ల నుంచి 15.12% పెరిగి రూ.931.03 కోట్లకు చేరింది. అగ్రి బిజినెస్‌ ఆదాయం రూ.3,607.30 కోట్ల నుంచి 13.05% తగ్గి రూ.3,136.43 కోట్లకు పరిమితమైంది. పేపర్‌బోర్డ్‌లు, పేపర్, ప్యాకేజింగ్‌ విభాగ ఆదాయం రూ.2,221.01 కోట్ల నుంచి 6.67% తగ్గి రూ.2,072.86 కోట్లకు పరిమితమైంది. ఇతర విభాగాల ఆదాయం (ఐటీ సేవలు, బ్రాండెడ్‌ రెసిడెన్స్‌లు తదితరాలు) రూ.868.29 కోట్ల నుంచి 11.46% పెరిగి రూ.967.80 కోట్లకు చేరింది.
  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ ఏకీకృత నికర లాభం రూ.19,476.42 కోట్ల నుంచి 6.54% పెరిగి రూ.20,751.36 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయం రూ.76,518.21 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.76,840.49 కోట్లకు చేరింది.
  • రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.7.50 (750%) చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. గతంలో ప్రకటించిన మధ్యంతర డివిడెండ్‌ రూ.6.25తో కలిపి, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం డివిడెండ్‌ రూ.13.75 అందించినట్లు అవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని