Japan: నాలుగో స్థానానికి పడిపోయిన జపాన్‌ ఆర్థిక వ్యవస్థ

Japan: జపాన్‌ జీడీపీ 4.2 ట్రిలియన్‌ డాలర్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే 0.4 శాతం క్షీణత నమోదైంది.

Updated : 15 Feb 2024 10:24 IST

టోక్యో: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జపాన్‌ (Japan) నాలుగో స్థానానికి పడిపోయింది. గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆ దేశ జీడీపీ 2023లో జర్మనీ కంటే తక్కువగా ఉంది. గత ఏడాది జపాన్‌ నామమాత్రపు జీడీపీ 4.2 ట్రిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో జర్మనీది 4.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.

అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో జపాన్‌ వాస్తవిక జీడీపీ వృద్ధిలో వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం క్షీణత నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 0.1 శాతం కుంగింది. నామమాత్రపు జీడీపీని ప్రస్తుత ధరల వద్ద, వాస్తవిక జీడీపీని స్థిర ధరల ఆధారంగా లెక్కిస్తారు. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడం వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ (Japan Economy) క్రమంగా దాని పోటీతత్వాన్ని, ఉత్పాదకతను ఎలా కోల్పోతుందో తాజా గణాంకాలు సూచిస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. 2010లో జపాన్‌ తన రెండో స్థానాన్ని చైనాకు సమర్పించుకుంది.

జపాన్‌, జర్మనీ రెండూ గణనీయమైన ఉత్పాదకతతో బలమైన చిన్న, మధ్య తరహా వ్యాపారాల ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకున్నాయి. యూరో, ద్రవ్యోల్బణం నేపథ్యంలో జపాన్‌తో పోలిస్తే జర్మనీ పటిష్ఠ ఆర్థిక పునాదులను వేసుకుంది. బలహీనమైన ‘యెన్’ కూడా టోక్యోకు ప్రతికూలంగా మారింది. బలహీనపడుతున్న ఆ దేశ స్థితిని, ప్రపంచంలో కోల్పోతున్న ఉనికిని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయని టోక్యో విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర ప్రొఫెసర్‌ టెత్సుజీ ఒకజాకీ అన్నారు. ఇటీవలి వరకు తమ దేశ వాహన తయారీ రంగం శక్తిమంతంగా ఉండేదన్నారు. విద్యుత్తు వాహనాల రాకతో అదీ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

వర్ధమాన, అభివృద్ధి చెందిన దేశాల మధ్య అంతరం తగ్గుతోందని ఒకజాకీ అభిప్రాయపడ్డారు. కొన్నేళ్లలో జీడీపీ పరంగా జపాన్‌ను భారత్‌ దాటేయడం నిశ్చయమన్నారు. దేశ శ్రామికశక్తి కొరతను అధిగమించడానికి వలస విధానం ఒక మార్గమని సూచించారు. కానీ, తమ దేశం మాత్రం విదేశీ కార్మికులను అనుమతించడం లేదన్నారు. దీంతో వైవిధ్యంలేని, వివక్షాపూరిత దేశంగా విమర్శలు ఎదుర్కొంటోందని తెలిపారు. రోబోలను పెద్ద ఎత్తున రంగంలోకి దించడం మరో మార్గమన్నారు. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా చేసిన ప్రయత్నాలు సంపూర్ణ ఫలితాలివ్వలేదని వివరించారు.

జపాన్‌ను (Japan) ఒక ‘‘ఆర్థిక అద్భుతం’’గా కీర్తిస్తుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురై అనూహ్యంగా పుంజుకున్న దేశంగా కొనియాడతారు. నిస్సారమైన భూముల నుంచి ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రశంసిస్తారు. ఇటీవలి వరకు దాని కీర్తి అలానే కొనసాగుతూ వచ్చింది. హోండా మోటార్‌, పానాసోనిక్‌ వంటి ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు ఆ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. జపాన్‌లో తయారైన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైనవిగా మంచి ఆదరణ ఉండేది. కానీ, రాబోయే కొన్నేళ్ల జపాన్‌ భవిష్యత్‌ మాత్రం అంధకారంగా కనిపిస్తోందని ఒకజాకీ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని