Jio Financial Services: జియో ఫిన్‌ మార్కెట్‌ క్యాప్‌ @ ₹2 లక్షల కోట్లు

Jio Financial Services: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు వరుసగా ఐదో రోజైన శుక్రవారమూ ర్యాలీ కొనసాగిస్తోంది.

Updated : 23 Feb 2024 13:25 IST

ముంబయి: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ (Jio Financial Services Mcap) రూ.2 లక్షల కోట్లు దాటింది. కంపెనీ షేర్లు వరుసగా ఐదో రోజైన శుక్రవారమూ దూసుకెళ్తున్నాయి. నేడు ఓ దశలో షేరు విలువ పది శాతానికి పైగా పెరిగి రూ.347 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది 41 శాతం రిటర్న్స్‌ ఇవ్వడం విశేషం. గత ఐదు రోజుల్లోనే షేరు విలువ 17 శాతం మేర పుంజుకుంది.

మరోవైపు జియో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) వాటాలు సైతం శుక్రవారం దూసుకెళ్తున్నాయి. ఓ దశలో దాదాపు 0.60 శాతం మేర ఎగసి రూ.2,988 దగ్గర రికార్డు గరిష్ఠాన్ని తాకింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.20.14 లక్షల కోట్లు దాటింది. ప్రస్తుతం దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రూ.2 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ కలిగినవి 13 కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్‌ అగ్ర స్థానంలో ఉండగా.. టీసీఎస్‌ (రూ.14.78 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ.10.78 లక్షల కోట్లు) తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.

డిసెంబర్‌ త్రైమాసికంలో జియో ఫైనాన్షియల్‌ (Jio Financial Services) నికర లాభం రూ.293 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం రూ.269 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.413 కోట్లుగా కంపెనీ నివేదించింది. ప్రస్తుతం భారత విపణిలో ఆర్థిక సేవలు, ఫిన్‌టెక్‌ సంస్థలు పలు నియంత్రణాపరమైన చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో ఫిన్‌ సెక్యూర్డ్‌ రుణాలపై దృష్టి సారించింది. అన్‌సెక్యూర్డ్‌ లోన్ల విషయంలో అప్రమత్తతో కూడిన వ్యూహాన్ని అనుసరిస్తోంది. మరోవైపు జనవరిలో ఈ కంపెనీతో పాటు బ్లాక్‌రాక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌.. మ్యూచువల్‌ ఫండ్‌ బిజినెస్‌ ప్రారంభించేందుకు సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని