క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌.. Disney+ Hotstar మొబైల్‌ ప్లాన్లకు Jio గుడ్‌బై

మరికొద్దిరోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతున్న వేళ.. జియో తన ప్రీపెయిడ్‌ప్లాన్లలో కొన్ని మార్పులు చేసింది. డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ ప్లాన్‌ కలిగిన బండిల్డ్‌ ప్లాన్లను తొలగించింది.

Updated : 18 Oct 2022 12:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)తో కలిసి రిలయన్స్‌ జియో (Jio) ఒకప్పుడు అనేక ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. దీంతో జియో వినియోగదారులు తక్కువ ఖర్చుతో టెలికాం సేవలతో పాటు క్రికెట్‌ మ్యాచ్‌లు, సినిమా వంటి ఓటీటీ వినోదాన్ని ఆనందించేవారు. మరికొద్దిరోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతున్న వేళ.. జియో తన ప్రీపెయిడ్‌ప్లాన్లలో కొన్ని మార్పులు చేసింది. డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ ప్లాన్‌ కలిగిన బండిల్డ్‌ ప్లాన్లను తొలగించింది. జియో నిర్ణయం క్రికెట్‌ అభిమానులకు చేదువార్తే.

రిలయన్స్‌ జియో రూ.499 నుంచి మొదలుకుని దాదాపు 11 ప్లాన్లపై డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందించేది. ప్రస్తుతం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కేవలం రెండు ప్లాన్లను మాత్రమే అందిస్తోంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ కావాలంటే రూ.1499 లేదా రూ.4199తో రీఛార్జి చేయాల్సి ఉంటుంది. రూ.1499 ప్లాన్‌ కింద ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తాయి. 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే రూ.4,199 ప్లాన్‌ కింద ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రోజువారీ 3జీబీ డేటా లభిస్తుంది.

టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు జియో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా మాత్రం డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్లాన్లు అందిస్తున్నాయి. మరోవైపు ఐపీఎల్‌ డిజిటల్‌ రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 దక్కించుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లను వయాకామ్‌ ప్రసారం చేయనుంది. దీని కోసం కొత్తగా ఏమైనా ప్లాన్లు జియో తీసుకురాబోతోందేమో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని