Reliance Jio: ఆఫ్రికాలో 4జీ-5జీ నెట్‌వర్క్‌ అభివృద్ధిలో జియో, టెక్‌ మహీంద్రా, నోకియా

ఆఫ్రికా దేశమైన ఘనాలో 4జీ, 5జీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో రిలయన్స్‌ జియో అనుబంధ సంస్థ ర్యాడిసిస్, టెక్‌ మహీంద్రా, నోకియా వంటి సంస్థలు పాలుపంచుకోనున్నాయి.

Published : 28 May 2024 02:38 IST

ముంబయి: ఆఫ్రికా దేశమైన ఘనాలో 4జీ, 5జీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో రిలయన్స్‌ జియో అనుబంధ సంస్థ ర్యాడిసిస్, టెక్‌ మహీంద్రా, నోకియా వంటి సంస్థలు పాలుపంచుకోనున్నాయి. ఈ సంస్థలతో ఘనా ప్రభుత్వ నేతృత్వంలోని నెక్స్ట్‌-జెన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ (ఎన్‌జీఐసీ) ఒప్పందాలు చేసుకుంది. నివేదికల ప్రకారం, కాంట్రాక్టు విలువ 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,660 కోట్లు)గా ఉంది. 5జీ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందుబాటు ధరల్లో అందించేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని పశ్చిమ ఆఫ్రికా కమ్యూనికేషన్‌ అండ్‌ డిజిటలైజేషన్‌ మంత్రి ఉర్సులా ఔసు-ఎకుఫుల్‌ తెలిపారు. ‘భారత్‌ తరహాలోనే మా దగ్గరా జనాభా ఉంది. టెలికాం రంగ వ్యాప్తిలో భారతీయ విధానాన్ని అనుసరించబోతున్నాం. కొన్నేళ్ల క్రితం జియో అమలు చేసిన నమూనాను అమలు చేయనున్నామ’ని తెలిపారు. ఎన్‌జీఐసీకి 5జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించారు. స్థానిక టెల్కోలు, ఈ సేవలను అందించేందుకు వచ్చే 6 నెలలు ఈ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకుంటాయి. ఘనా అనేది 33 దేశాల స్మార్ట్‌ ఆఫ్రికా అలయన్స్‌. ఆఫ్రికాలోని మిగతా దేశాలు ఘనా పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నాయని ఉర్సులా పేర్కొన్నారు. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలో భారతీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా ఉంది. జియో కూడా అక్కడి మార్కెట్‌లోనూ ఎయిర్‌టెల్‌తో పోటీ పడబోతోంది.

స్పెక్ట్రమ్‌ రుసుం వాయిదా చెల్లింపులకు 18% జీఎస్‌టీ!: టెలికాం కంపెనీలు స్పెక్ట్రమ్‌ రుసుము నిమిత్తం చెల్లించే వాయిదా మొత్తాలకు 18% జీఎస్‌టీ వర్తిస్తుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మొబైల్‌ ఫోన్ల సేవలకు సంబంధించి 8 బ్యాండ్‌లలో   స్పెక్ట్రమ్‌ వేలాన్ని జూన్‌ 6న టెలికాం విభాగం నిర్వహించనుంది. వేలానికి కనీస ధరగా రూ.96,317 కోట్లు గా నిర్ణయించారు. 20 ఏళ్ల వ్యవధికి స్పెక్ట్రమ్‌ కేటాయిస్తారు. వేలంలో విజయవంత బిడ్డర్‌లుగా నిలిచిన సంస్థలు, స్పెక్ట్రమ్‌ రుసుమును 20 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లించొచ్చు. ప్రతి వాయిదా మొత్తానికి 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలని ఆ అధికారి తెలిపారు. ‘స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న సంస్థలు జీఎస్‌టీ చెల్లించాల్సిన విషయమై జీఎస్‌టీ మండలి తదుపరి సమావేశంలో స్పష్టత లభించే అవకాశం ఉంద’ని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని