Kairan Quazi: 14 ఏళ్లకే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. అదీ స్పేస్ఎక్స్‌లో!

Kairan Quazi: 14 ఏళ్ల వయసులోనే స్పేస్‌ఎక్స్‌ లాంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలో జాబ్‌ కొట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ, దీన్ని చేసి చూపించాడు కైరన్‌ క్వాజీ.

Updated : 12 Jun 2023 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ కుర్రాడికి 14 ఏళ్ల వయసనగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఫ్రెండ్స్‌తో కబుర్లు, గ్రౌండ్‌లో ఆటలు, స్కూళ్లో పాఠాలు, సినిమాలు, షికార్లు.. ఇవే కదా! అవును మరి.. ఓ సాధారణ కుర్రాడి జీవితం ఇలాంటి చట్రంలోనే గడిచిపోతుంటుంది! కానీ, దీనికి భిన్నంగా ఓ పిల్లోడు మాత్రం 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీలో ఉద్యోగం కొట్టేశాడు. ఆ కుర్రాడి పేరే కైరన్‌ క్వాజీ (Kairan Quazi). అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం..

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన క్వాజీ (Kairan Quazi) శాంటాక్లారా యూనివర్శిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి త్వరలోనే గ్రాడ్యుయేట్‌ పట్టా తీసుకోనున్నాడు. స్పేస్‌ఎక్స్‌లోని స్టార్‌లింక్‌ బృందంలో త్వరలోనే చేరనున్నానంటూ క్వాజీ తన లింక్డిన్‌లో ఇటీవల పోస్ట్‌ చేశాడు. అత్యంత పారదర్శక, సవాల్‌తో కూడిన సాంకేతికత, ఫన్‌ ఇంటర్వ్యూ ప్రాసెస్‌ను తాను అధిగమించినట్లు తెలిపాడు. దీంతో స్టార్‌లింక్‌ ఇంజినీరింగ్‌ టీమ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరుతున్నట్లు పేర్కొన్నాడు. సామర్థ్యం, పరిపక్వతకు వయసును ఆధారంగా తీసుకునే కాలంచెల్లిన సంప్రదాయానికి స్వస్తి చెప్పి స్పేస్‌ఎక్స్‌ (SpaceX) తనకు అవకాశం కల్పించినట్లు తెలిపాడు.

లింక్డిన్‌ బయో ప్రకారం.. క్వాజీకి కృత్రిమ మేధ (Artificial Intelligence- AI), మెషీన్‌ లెర్నింగ్‌పై శిక్షణ పొందిన అనుభవం ఉంది. కొన్ని ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో అతను ఇంటర్న్‌షిప్‌ చేయడంతో అత్యాధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులోనే లాస్‌ పోసిటాస్‌ కమ్యూనిటీ కాలేజ్‌లో చేరాడు. అసోసియేట్‌ ఆఫ్‌ సైన్స్‌ (మేథమేటిక్స్‌)లో అత్యున్నత గ్రేడ్‌తో పాసయ్యాడు. ఇంటెల్‌ ల్యాబ్స్‌లో డైరెక్టర్‌ ఆఫ్‌ ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌ లామా నచ్‌మన్‌తో కలిసి జనరేటివ్‌ ఏఐపై పనిచేయడమే తన కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పాడు.

రెండేళ్ల వయసులోనే క్వాజీ (Kairan Quazi) స్పష్టంగా మాట్లాడేవాడని తల్లిదండ్రులు చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మూడో తరగతికి వచ్చే సరికి టీచర్లు క్వాజీ ప్రతిభని గుర్తించి.. అతడికి సాధారణ విద్య సరిపోదని గుర్తించారట! ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా క్వాజీ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన ప్రతిభను గుర్తించి, తన సామర్థ్యంపై నమ్మకం ఉంచిన స్పేస్‌ఎక్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లింక్డిన్‌లో రాసుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని