MPCE: గ్రామీణ కుటుంబాల నెలవారీ తలసరి వ్యయం రూ.3,773

MPCE: 11 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక గణాంకాలను వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.3,773కు చేరింది. పట్టణాల్లో ఇది రూ.6,459గా ఉంది.

Published : 25 Feb 2024 11:44 IST

దిల్లీ: దేశంలో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం (MPCE) పట్టణాల్లో 2022-2023లో రూ.6,459కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,773గా నమోదైంది. మొత్తం వ్యయంలో ఆహార ఖర్చుల వాటా గ్రామీణ ప్రాంతాల్లో 52.9 శాతం నుంచి 46.4 శాతానికి తగ్గింది. పట్టణాల్లో 42.6 శాతం నుంచి 39.2 శాతానికి క్షీణించడం గమనార్హం. జాతీయ గణాంక సర్వే కార్యాలయం నిర్వహించిన ‘గృహ వినియోగ వ్యయ సర్వే (HCES)’ ఫలితాలను శనివారం ప్రభుత్వం వెల్లడించింది. 11 ఏళ్లలో ఎంపీసీఈ వివరాలు తొలిసారి వెలువడ్డాయి. ఆగస్టు 2022 నుంచి జులై 2023 మధ్య ఈ సర్వేను నిర్వహించారు.

మొత్తం 2,61,746 కుటుంబాల నుంచి వివరాలను సేకరించారు. ఇందులో 1,55,014 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో, 1,06,732 కుటుంబాలు పట్టణాల్లో ఉన్నాయి. హెచ్‌సీఈఎస్‌ను ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించాలి. కానీ, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తర్వాత 2017-18లో చేపట్టిన సర్వే ఫలితాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. గణాంకాలను రూపొందించిన విధానంలో లోపాలున్నాయని వివరించింది. జీడీపీ, రిటైల్‌ ద్రవ్యోల్బణం, పేదరిక స్థాయిలను నిర్ధరించడానికి ఎంపీసీఈ గణాంకాలు చాలా కీలకం.

18 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీసీఈ ఆరు రెట్లు పెరిగింది. 2004-05లో ఇది గ్రామీణ ప్రాంతాల్లో రూ.579, పట్టణాల్లో రూ.1,105గా నమోదైంది. వరుసగా 552%, 484 శాతంగా వృద్ధి రికార్డయ్యింది. 2022-23లో అట్టడుగున ఉన్న ఐదు శాతం గ్రామీణ జనాభా సగటు ఎంపీసీఈ రూ.1,373గా, పట్టణ ప్రాంతాల్లో రూ.2,001గా నమోదైంది. ఎగువన ఉన్న ఐదు శాతం మంది సగటు ఎంపీసీఈ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వరుసగా రూ.10,501, రూ.20,824గా నమోదైంది. 

రాష్ట్రాలవారీగా చూస్తే సిక్కింలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీసీఈ రూ.7,731, పట్టణాల్లో రూ.12,105గా నమోదైంది. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌లో ఇది వరుసగా రూ.2,466, రూ.4,483గా ఉంది. నెలవారీ సగటు ఆహార వ్యయం గ్రామీణ కుటుంబాల్లో రూ.1,750గా, పట్టణాల్లో రూ.2,530గా నమోదైంది. ఆహారేతర ఖర్చులు వరుసగా రూ.2,203, రూ.3,929గా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని