Shaktikanta Das: కీలక రేట్లు మారకపోవచ్చు!

కీలక రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం బుధవారం ప్రారంభమైంది.

Published : 06 Jun 2024 03:17 IST

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం

దిల్లీ: కీలక రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈ సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడిస్తారు. అయితే ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళనకర స్థాయిల్లోనే ఉన్నందున కీలక రేట్లలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరిసారి 2023 ఫిబ్రవరిలో ఆర్‌బీఐ కీలక రేట్లలో మార్పులు చేసింది. అప్పటి నుంచి వరుసగా ఏడు సార్లు యథాతథ స్థితిని కొనసాగిస్తూ వస్తోంది. మరోవైపు ప్రస్తుత సర్దుబాటు విధాన వైఖరిని ఆర్‌బీఐ కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించే అవకాశం ఉందనీ పేర్కొంది. మేలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతంగా కొనసాగొచ్చని, ఆ తర్వాత నుంచి తగ్గుతూ జులైలో 3 శాతానికి దిగిరావొచ్చని వెల్లడించింది.


‘భారత ఆర్థిక వ్యవస్థ రాణించడం కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆకర్షణీయంగా 8.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత విధాన వైఖరిని ఆర్‌బీఐ కొనసాగిస్తుందని భావిస్తున్నాం. ఈ ఏడాదిలో కీలక రేట్లను తగ్గించే అవకాశాలైతే పెద్దగా కనిపించడం లేదు’

ధ్రువ్‌ అగర్వాల్, సీఈఓ, హౌసింగ్‌.కామ్, ప్రోప్‌టైగర్‌.కామ్‌ గ్రూపు


‘కీలక రేట్లు యథాతథంగా కొనసాగించడం, లేదంటే తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో ద్రవ్యలభ్యత పరంగా ఉన్న అవరోధాలను తగ్గించేందుకు, వినియోగదారు విశ్వాసానికి ఊతమిచ్చేలా చర్యలు చేపడతారని భావిస్తున్నాం. ఎందుకంటే ఈ చర్యలు స్థిరాస్తి విక్రయాలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది’

అనంతరామ్‌ వరయుర్, సహవ్యవస్థాపకుడు, మనసుమ్‌ సీనియర్‌ లివింగ్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని