RBI: 7% కాదు 7.2%

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా ఎనిమిదో ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) సమావేశంలోనూ కీలక రేట్లను యథాతథంగానే ఉంచింది. 2022 మే తదుపరి 250 బేసిస్‌ పాయింట్ల మేర పెంచి, రెపోరేటును 6.5 శాతంగా చేసిన ఆర్‌బీఐ, 2023 ఏప్రిల్‌ నుంచి అందులో మార్పు చేయలేదు.

Updated : 08 Jun 2024 02:12 IST

2024-25 వృద్ధిరేటు అంచనాలు పెంచిన ఆర్‌బీఐ
ప్రైవేటు వినియోగం, గ్రామీణ గిరాకీ పెరగడం వల్లే
వరుసగా ఎనిమిదో సారీ కీలక రేట్లలో మార్పు లేదు
ద్రవ్యోల్బణ లక్ష్యం చేరాకే కోతపై ఆలోచన
ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా ఎనిమిదో ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) సమావేశంలోనూ కీలక రేట్లను యథాతథంగానే ఉంచింది. 2022 మే తదుపరి 250 బేసిస్‌ పాయింట్ల మేర పెంచి, రెపోరేటును 6.5 శాతంగా చేసిన ఆర్‌బీఐ, 2023 ఏప్రిల్‌ నుంచి అందులో మార్పు చేయలేదు.

వృద్ధిరేటు అంచనాల పెంపు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 7.2 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. ప్రైవేటు వినియోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం ఇందుకు సహకరిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు. ‘2024-25లో ఇప్పటిదాకా దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలంగానే కొనసాగాయి. దేశీయ గిరాకీ బలంగా ఉండడంతో తయారీ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. సేవల రంగమూ రాణిస్తోంది. పెట్టుబడులూ పెరుగుతున్నాయి. సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు, ఖరీఫ్‌ దిగుబడికి సానుకూలాంశం. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 7.2% వృద్ధి నమోదు కావొచ్చ’ని దాస్‌ పేర్కొన్నారు. బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలతో పాటు కేంద్రం వద్ద బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ ఉన్నందున మూలధన వ్యయాలు అధికమవుతాయని, అధిక సామర్థ్య వినియోగానికి, వ్యాపారాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంద’ని ఆయన అన్నారు.

రేట్ల కోత ప్రారంభించాలంటే: రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యమైన 4% (2 శాతం అటూ ఇటూ)లోపునకు చేరుతుందన్న విశ్వాసం వచ్చేవరకు, రేట్ల కోత దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోబోమని దాస్‌ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ అంచనాల ప్రకారం.. డిసెంబరు త్రైమాసికంలో వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం 3.8 శాతానికి  చేరనుంది. అయితే ఆ తర్వాత 5 శాతానికి పెరగొచ్చు. మొత్తం మీద 4% దరిదాపులకు చేరితేనే ‘విధాన చర్యలకు’ అవకాశం ఉంటుందని దాస్‌ పునరుద్ఘాటించారు.

బ్యాంకులు వ్యూహాలు మార్చుకోవాలి అవసరం: రుణాలు, డిపాజిట్లలో వృద్ధి మధ్య అంతరాన్ని పూడ్చుకోవాలంటే బ్యాంకులు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలని దాస్‌ అన్నారు. హామీలేని రిటైల్‌ రుణాల్లో భారీ వృద్ధి ఉండడంపై గతేడాది నవంబరులో ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజా గణాంకాల ప్రకారం.. ఈ రుణాల జారీ కొంత నెమ్మదించింది. అయినా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ,  అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని దాస్‌ పేర్కొన్నారు.


రూ.3 కోట్లు మించితేనే బల్క్‌ డిపాజిట్‌ 

బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పరిమితిని ఆర్‌బీఐ శుక్రవారం పెంచింది. ప్రస్తుతం రూ.2 కోట్ల వరకు చేసే డిపాజిట్‌ను రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్‌గా పరిగణిస్తున్నారు. అంతకుమించితే బల్క్‌ డిపాజిట్‌గా వ్యవహరిస్తారు.  ఇప్పుడు ఈ పరిమితిని రూ.3 కోట్లకు సవరించింది. బ్యాంకుల ఆస్తుల నిర్వహణను మరింత మెరుగుపరచుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లతో పోలిస్తే బల్క్‌ డిపాజిట్లు కాస్త అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు (ఎస్‌సీబీ), స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు (ఎస్‌ఎఫ్‌బీ)ల్లో రూ.3 కోట్లు అంతకు మించిన డిపాజిట్లనే బల్క్‌ డిపాజిట్లుగా పరిగణిస్తారు. 


బ్రిటన్‌ నుంచి 100 టన్నుల పసిడి తెచ్చాం

బ్రిటన్‌లో నిల్వ ఉంచిన 100 మెట్రిక్‌ టన్నుల పసిడి నిల్వలను మన దేశానికి తీసుకొచ్చినట్లు దాస్‌ తెలిపారు. దేశీయంగా సరిపడా నిల్వ సామర్థ్యం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం మినహా, ఇందుకు మరో కారణం లేదని దాస్‌ స్పష్టం చేశారు. 1991 తర్వాత దేశంలోకి ఇంత భారీగా పసిడి నిల్వలను తెప్పించడం ఇదే తొలిసారి. చాలా కాలం నుంచి విదేశాల్లో మన పసిడి నిల్వలు ఉన్నాయని దాస్‌ అన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. 2023-24లో మనదేశం అధికారికంగా 27.46 మెట్రిక్‌ టన్నుల పసిడిని కొనుగోలు చేయడంతో, మన నిల్వలు 822 టన్నులకు చేరాయి. ఇటీవల తీసుకొచ్చిన 100 టన్నుల బంగారంతో కలిపి, దేశీయంగా నిల్వ చేసిన మొత్తం 408 మెట్రిక్‌ టన్నులను మించింది.


విదేశీ మారకపు నిల్వలు 651 బిలియన్‌ డాలర్లు

మన విదేశీ మారకపు నిల్వలు మే 31తో ముగిసిన వారానికి 4.837 బిలియన్‌ డాలర్లు పెరిగి కొత్త గరిష్ఠ స్థాయి అయి 651.51 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. అంతక్రితం వారంలో ఈ నిల్వలు 2.027 బి. డాలర్లు తగ్గి 646.673 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 

మోసాల నివారణ కోసం..

డిజిటల్‌ చెల్లింపుల్లో మోసాలను నివారించి, వినియోగదారులకు భరోసా కలిగించేలా ఒక ప్రత్యేక వేదిక తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం ‘డిజిటల్‌ పేమెంట్స్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాం’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. చెల్లింపుల మోసాలను నివారించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఎన్‌పీసీఐ మాజీ ఎండీ, సీఈఓ ఏపీ హోతా నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాట్‌ఫాం ఏర్పాటుపై ఈ కమిటీ రెండు నెలల్లో తన నివేదిక సమర్పిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.


యూపీఐ లైట్‌లో ఆటోమేటిక్‌గా నిధుల భర్తీ

ఫాస్టాగ్‌కూ వర్తించేలా ప్రతిపాదన

చిన్న మొత్తాల్లో చేసే డిజిటల్‌ చెల్లింపులు ఇక నుంచి మరింత సులభం కానున్నాయి. యూపీఐ లైట్‌ వాలెట్‌లో బ్యాంకు ఖాతా నుంచి నేరుగా (ఆటోమేటిక్‌) నిధులు భర్తీ అయ్యే వీలు లభించడమే ఇందుకు కారణం. ఈ దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌కూ ఇదే విధానాన్ని వర్తింపచేసే దిశగా ఆర్‌బీఐ సూచనలు జారీ చేసింది. 

  • క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, లేదా ఫోన్‌నంబరుకు తక్కువ మొత్తం చెల్లింపులు యూపీఐ విధానంలో చేస్తున్న ప్రతిసారీ పిన్‌ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా, బ్యాంకు ఖాతాలో ఇలాంటి చిన్న చెల్లింపుల వివరాలూ కనిపించకుండా ఉండేలా 2022 సెప్టెంబరులో ఆర్‌బీఐ యూపీఐ లైట్‌ను తీసుకొచ్చింది. దీనిలో గరిష్ఠంగా రూ.2,000 వరకూ నిధులు నిల్వ చేసుకోవచ్చు. ఒక రోజులో రూ.2,000 విలువైన లావాదేవీలను నిర్వహించొచ్చు. ఒకసారి రూ.500 వరకు యూపీఐ లైట్‌తో చెల్లించొచ్చు. యూపీఐ లైట్‌ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ‘ఇ-మ్యాండేట్‌’ను తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ తెలిపారు. ‘యూపీఐ లైట్‌లో ఉన్న మొత్తం వినియోగదారులు పేర్కొన్న నిర్ణీత పరిమితికి వచ్చినప్పుడు, నేరుగా బ్యాంకు ఖాతా నుంచి గరిష్ఠ పరిమితి మేరకు నిధులు భర్తీ అవ్వవడమే ఈ విధానమ’ని దాస్‌ తెలిపారు. ఈ పరిమితిని వినియోగదారులే నిర్ణయించుకోవాలి. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు నిల్వను బట్టి, ఆటోమేటిక్‌గా వాలెట్‌లోకి చేరతాయి. 
  • ఫాస్టాగ్‌తో పాటు నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు (ఎన్‌సీఎంసీ) తదితరాలకూ ఇలాంటి వెసులుబాటు కల్పించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులు ప్రతిసారీ తమ కార్డుల్లో డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుందని, వారి ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుందని శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు