Krishna Ella: డాక్టర్‌ కృష్ణ ఎల్లకు ‘డీన్స్‌ మెడల్‌’ పురస్కారం

భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నుంచి  ప్రతిష్ఠాత్మక డీన్స్‌ మెడల్‌ లభించింది. ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది.

Published : 25 May 2024 02:26 IST

డాక్టర్‌ కృష్ణ ఎల్లకు డీన్స్‌ మెడల్‌ ప్రదానం చేస్తున్న జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డీన్‌ ఎల్లెన్‌ జె.మెకెంజీ

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నుంచి  ప్రతిష్ఠాత్మక డీన్స్‌ మెడల్‌ లభించింది. ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది. ఈ నెల 22న మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో నిర్వహించిన బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ కాన్వకేషన్‌లో డాక్టర్‌ కృష్ణ ఎల్లకు డీన్స్‌ మెడల్‌ అందించారు. భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి లభించిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నట్లు డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. ఈ మెడల్‌ను భారతదేశానికి, ఇక్కడి శాస్త్రవేత్తలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. డాక్టర్‌ కృష్ణ ఎల్ల సారథ్యంలో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్, బయోటెక్నాలజీ రంగంలో, టీకాల ఆవిష్కరణలో అత్యంత క్రియాశీలక సంస్థగా ఎదిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన టైఫాయిడ్‌ కంజుగేట్‌ టీకా- టైప్‌బార్‌ టీసీవీ, రొటావైరస్‌ టీకా- రొటావ్యాక్, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ టీకా- జెన్‌వ్యాక్‌ తో పాటు 19 టీకాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. వివిధ దేశాలకు ఇప్పటి వరకూ 900 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేసింది. అన్నింటికంటే మించి కొవిడ్‌-19 ముప్పును ఎదుర్కోడానికి ఈ సంస్థ కొవాగ్జిన్‌ టీకాను అతి తక్కువ సమయంలో తీసుకువచ్చింది. ఈ టీకాను మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వినియోగించారు. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్, కలరా, మలేరియా, టీబీ, చికున్‌గున్యా, జికా.. తదితర వ్యాధులకు టీకాలు ఆవిష్కరించే పనిలో ఉంది. ఈ సంస్థకు 145 పేటెంట్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని