LAVA: లావాకు షాక్‌.. ఎరిక్సన్‌కు ₹244 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశం

పేటెంట్ల వ్యవహారంలో ఎరిక్సన్‌ సంస్థకు రూ.244 కోట్లు పరిహారంగా చెల్లించాలని దిల్లీ హైకోర్టు లావా సంస్థను ఆదేశించింది.

Published : 04 Apr 2024 15:58 IST

LAVA | దిల్లీ: దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ లావాకు (LAVA) ఎదురుదెబ్బ తగిలింది. పేటెంట్‌ ఉల్లంఘన కేసులో స్వీడన్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ సంస్థ ఎరిక్సన్‌కు (Ericsson) అనుకూలంగా తీర్పు వెలువడింది. 2జీ, 3జీకి సంబంధించిన పేటెంట్లను ఉల్లంఘించినందుకు గానూ రూ.244 కోట్లు ఎరిక్సన్‌కు చెల్లించాలని లావాను కోర్టు ఆదేశించింది. ఈమేరకు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమిత్‌ బన్సల్‌ ఇటీవల తీర్పును వెలువరించారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పేటెంట్ల ఉల్లంఘనకు సంబంధించి ఎరిక్సన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. 8 పేటెంట్లలో ఏడింటి చెల్లుబాటును సమర్థించింది. అడాప్టివ్‌ మల్టీరేట్‌ స్పీచ్‌ కోడెక్‌, ఎన్‌హ్యాన్స్‌డ్‌ డేటా రేట్స్‌ ఫర్‌ జీఎస్‌ఎం ఎవల్యూషన్‌, 3జీ టెక్నాలజీ ఫీచర్లకు సంబంధించిన పేటెంట్లు ఇందులో ఉన్నాయి. ఎరిక్సన్‌కు జరిగిన నష్టానికి గానూ రూ.244 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు లావాను ఆదేశించింది. తీర్పు వెలువరించిన నాటినుంచి పూర్తి చెల్లింపులు జరిపేంతవరకు 5 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలంది. ఎరిక్సన్‌కు అయిన కోర్టు ఖర్చులనూ లావానే భరించాలని ఆదేశించింది.

ఎరిక్సన్‌ పేటెంట్ల చెల్లుబాటు, ఆవశ్యకత గురించి చెబుతూ లావా చేసిన వాదనలను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. లైసెన్స్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకోవడంలో లావా విఫలమైందని పేర్కొంది. చిప్‌సెట్‌ విలువపై రాయల్టీని లెక్కించాలన్న లావా వినతిని తోసిపుచ్చింది. టెలీకమ్యూనికేషన్‌ పరిశ్రమలో అంతిమ ఉత్పత్తి విలువపైనే రాయల్టీ చెల్లింపు సమంజసమని కోర్టు పేర్కొంది. పేటెంట్లు వంటి క్లిష్టమైన అంశాల్లో వాదనలు వినిపించిన ఇరు సంస్థల తరఫున న్యాయవాదులను, లీగల్‌ పరిశోధకుల సహకారాన్ని జస్టిస్‌ బన్సల్‌ కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని