LIC: ఆరోగ్య బీమాలోకి ఎల్‌ఐసీ

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) కొత్తగా  ఆరోగ్య బీమా విభాగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది.

Published : 29 May 2024 03:26 IST

సంస్థ ఛైర్మన్‌ వెల్లడి

ముంబయి: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) కొత్తగా  ఆరోగ్య బీమా విభాగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం అవసరాన్ని బట్టి, ఈ రంగంలోని సంస్థలను కొనుగోలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్‌ సిద్థార్థ మొహంతి తెలిపారు. భారతీయ బీమా చట్టం 1938, భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నియమావళి ప్రకారం జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా పాలసీలను ఒకే బీమా సంస్థ అందించలేదు. ఈ నిబంధనలను మార్చి, కొత్తగా కాంపోజిట్‌ లైసెన్సులను ఐఆర్‌డీఏఐ జారీ చేస్తుందనే అంచనాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే, మార్చి త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సాధారణ బీమా విభాగంలో ఎల్‌ఐసీకి నైపుణ్యం లేదు. కానీ, ఆరోగ్య బీమాను నిర్వహించగలదు. ఇందుకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఇతర సంస్థల కొనుగోలు ద్వారా ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించాలన్నది యోచన’ అని పేర్కొన్నారు. 

ఇదీ నేపథ్యం

జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా పాలసీలను ఒకే బీమా సంస్థ నిర్వహించేందుకు వీలుగా కాంపోజిట్‌ లైసెన్సు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. దీనికి సంబంధించి బీమా చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల పాలసీదారులకు మేలు చేకూరుతుందని పేర్కొంది. ఒకే పాలసీలో జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా లభించేలా తీసుకొచ్చేందుకు వీలవుతుందనీ పేర్కొంది. ఇందువల్ల తక్కువ ప్రీమియానికి పాలసీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది. జీవిత బీమా రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెడితే ఒక సంచలనమే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని