SBI: ఎంఎస్‌ఎంఈలకు 45 నిమిషాల్లోనే రుణం

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తక్కువమొత్తం వ్యాపార రుణాలపై దృష్టి పెడుతోంది. రాబోయే అయిదేళ్లలో వృద్ధి, లాభాలు ఈ విభాగం నుంచే అధికంగా వస్తాయని భావిస్తోంది.

Updated : 12 Jun 2024 19:37 IST

డిజిటల్‌ బిజినెస్‌ లోన్స్‌ను ప్రారంభించిన ఎస్‌బీఐ
ఈనాడు - హైదరాబాద్‌

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తక్కువమొత్తం వ్యాపార రుణాలపై దృష్టి పెడుతోంది. రాబోయే అయిదేళ్లలో వృద్ధి, లాభాలు ఈ విభాగం నుంచే అధికంగా వస్తాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) కేవలం 45 నిమిషాల్లోనే రుణం మంజూరు చేసేలా ‘ఎస్‌ఎంఈ డిజిటల్‌ బిజినెస్‌ లోన్స్‌’ను ప్రారంభించినట్లు బ్యాంక్‌ మంగళవారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో  ఎస్‌ఎంఈలకు బ్యాంకు రూ.4.33 లక్షల కోట్ల మేరకు రుణాలు ఇచ్చింది. 2022-23లో మంజూరు చేసిన మొత్తంతో పోలిస్తే ఇది 20% అధికం. ఈ విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు 2019-20లో 9.43% కాగా, 2023-24 నాటికి ఇవి 3.75 శాతానికి తగ్గాయని బ్యాంక్‌ పేర్కొంది. ఎంఎస్‌ఎంఈలకు అధికంగా రుణాలు ఇవ్వడం ద్వారా, ఈ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామని ఎస్‌బీఐ బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు సంబంధించిన తమ వద్ద ఎంతో సమాచారం ఉందని, దాన్ని విశ్లేషించడం ద్వారా రుణ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ‘కొత్తగా ప్రారంభించిన ఈ విధానం సంప్రదాయంగా ఉన్న క్రెడిట్‌ అండర్‌ రైటింగ్, సుదీర్ఘమైన పరిశీలనల వంటి వాటిని తొలగిస్తుంది. చిన్న పరిశ్రమలకు రుణ వితరణ సరళంగా ఉండటంతోపాటు, వేగం పెరుగుతుంది’ అని వెల్లడించారు.

ఇవి ఉంటే: ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్నులు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్ల వంటి వాటితో పాటు, అవసరమైన వివరాలను సమర్పించిన తర్వాత కేవలం 10 సెకన్లలోపే రుణం మంజూరు నిర్ణయాన్ని తెలియజేసేలా డేటా ఆధారిత రుణ మంజూరు సాంకేతికతను ఈ కొత్త విధానంలో అభివృద్ధి చేశామని ఎస్‌బీఐ పేర్కొంది. రూ.50 లక్షల లోపు రుణాల వరకూ ఆర్థిక నివేదికల అవసరమూ ఉండదని, కేవలం జీఎస్‌టీ రిటర్నులు సమర్పిస్తే సరిపోతుందని పేర్కొంది. ఇప్పటికే బ్యాంకుతో అనుబంధం ఉన్న సంస్థలతో పాటు, కొత్త వాటికీ 45 నిమిషాల్లోనే సూత్రప్రాయంగా రుణ అనుమతి పొందేలా డిజిటల్‌ బిజినెస్‌ లోన్స్‌ విభాగం తోడ్పడుతుందని ఎస్‌బీఐ రిటైల్‌ బ్యాంకింగ్, ఆపరేషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినయ్‌ టోన్సే తెలిపారు.


రూ.25,000 కోట్ల సమీకరణకు నిర్ణయం: ఎస్‌బీఐ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.25,000 కోట్ల (3 బిలియన్‌ డాలర్లు)ను సమీకరించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు  బోర్డు అనుమతి లభించినట్లు మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో బ్యాంక్‌ వెల్లడించింది. ఈ మొత్తాన్ని పబ్లిక్‌ ఆఫర్, సెక్యూరిటీ లేని రుణపత్రాల జారీ ద్వారా సమీకరించనుంది. అమెరికా డాలర్‌ లేదా ఇతర దేశాల కరెన్సీ రూపాల్లో ఈ రుణ పత్రాలు ఉంటాయని బ్యాంక్‌ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని