Mahila Savings: నేటి నుంచే మహిళా సమ్మాన్‌ పొదుపు పథకం.. పోస్టాఫీసుల్లో అందుబాటులోకి

Mahila Samman Savings Certificates: మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పొదుపు పథకం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు పలు పొదుపు పథకాల్లోనూ అనేక మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

Updated : 01 Apr 2023 17:47 IST

దిల్లీ: 'ఆజాదీకా అమృత్‌ మహోత్సవం'లో భాగంగా మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా కొత్త చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని 2023-24 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (Mahila Samman Savings Certificates )’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం నేటి (ఏప్రిల్‌ 1) నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిన్న అర్ధరాత్రి తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1.59లక్షల పోస్టాఫీసుల్లో ఈ పథకాన్ని తక్షణమే అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లను (Mahila Samman Savings Certificates) మహిళలు లేదా బాలికల పేరుపై మాత్రమే తీసుకునే వీలుంది. 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉండనుంది. ఈ పథకానికి 7.50% స్థిర వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది. డిపాజిట్‌పై రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి ఉంది. ప్రస్తుతానికి ఈ పథకం పోస్టాఫీసుల్లో (Post Offices) అందుబాటులోకి రాగా.. బ్యాంకుల్లో ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఎలా తెరవాలి?

  • మీ సమీపంలోని పోస్టాఫీసును (Post Office) సందర్శించి మహిళా సమ్మాన్‌ బచత్‌ పత్ర యోజన ఫారంను తీసుకోవాలి.
  • వ్యక్తిగత, ఆర్థిక, నామినేషన్‌ వివరాలను అందించి దరఖాస్తు పూర్తి చేయాలి.
  • గుర్తింపు, చిరునామా రుజువు కోసం అవసరమైన పత్రాలను (ఆధార్‌, పాన్‌) దరఖాస్తు ఫారంతో పాటు సమర్పించాలి.
  • డిపాజిట్‌ మొత్తాన్ని ఎంచుకుని, నగదు లేదా చెక్కు ద్వారా డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.
  • పెట్టుబడికి రుజువుగా సర్టిఫికెట్‌ను ఇస్తారు. దీన్ని తీసుకోవాలి.
  • ఈ పథకం లావాదేవీ జరిపినందుకు గానూ రసీదు కాగిత రూపంలో కావాలంటే రూ.40 ఛార్జిని వసూలు చేస్తారు. ఇ-మోడ్‌లో కావాలనుకుంటే రూ.9 చెల్లించాలి.
  • ఏడాది తర్వాత పాక్షికంగా నగదు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. డిపాజిట్‌ మొత్తంలో 40శాతం వెనక్కి ఇస్తారు. 
  • గడువు తీరకముందే ఖాతాను మూసివేయడానికి అనుమతించరు. కానీ, ఖాతాదారు చనిపోయినా, తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నా, ముందస్తుగా ఖాతాను రద్దు చేసుకోవచ్చు. అయితే, ఖాతాను ప్రారంభించి ఆరు నెలలు పూర్తవ్వాలి.

ఇదీ చదవండి: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెంపు

డిపాజిట్లపై పరిమితి పెంపు..

మహిళల పథకంతో పాటు పలు పొదుపు పథకాల్లోనూ నేటి నుంచి అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇంతకు ముందు సీనియర్ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌లో ఒక్కో వ్యక్తి రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా డిపాజిట్‌ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడా ఆ పరిమితిని రూ.30లక్షలకు పెంచారు. దీంతో పాటు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (MIS) పరిమితిని కూడా పెంచారు. ఇంతకు ముందు సింగిల్‌ అకౌంట్‌ కలిగిన వ్యక్తి నెలకు కేవలం రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్‌ చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ డిపాజిట్‌ను రూ.9లక్షలకు పెంచారు. ఇక జాయింట్‌ అకౌంట్‌లో రూ.7.5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.15లక్షల వరకు పెంచారు. దీంతో పాటు పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల (small savings schemes) వడ్డీ రేట్లను (Interest Rates) కూడా సవరించారు. ఈ కొత్త వడ్డీ రేట్లు కూడా నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు