UPI: ఇకపై సింగపూర్‌ నుంచి యూపీఐ ద్వారా రెమిటెన్స్‌ చెల్లింపులు

సింగపూర్‌ నుంచి భారతీయులు యూపీఐ ద్వారా రెమిటెన్స్ చెల్లింపులు చేయొచ్చని ఎన్‌పీసీఐ తెలిపింది.  

Updated : 11 Jan 2024 18:41 IST

దిల్లీ: సింగపూర్‌లో ఉంటున్న భారతీయులు ఇకపై యూపీఐ (UPI), బ్యాంకింగ్‌ యాప్‌ల ద్వారా నేరుగా తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయొచ్చని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భీమ్‌, ఫోన్‌పే, పేటీఎం యూజర్లతోపాటు ఎస్‌బీఐ, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, డీబీఎస్‌ బ్యాంకుల ఖాతాదారులు రెమిటెన్స్ (విదేశంలో ఉంటున్న వారు స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులకు పంపే నగదు) చెల్లింపులు చేయొచ్చు. త్వరలో మరిన్ని బ్యాంకింగ్ యాప్‌లలో ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్‌పీసీఐ తెలిపింది. 

‘‘నూతనంగా తీసుకొచ్చిన ఈ విధానంతో సింగపూర్‌లోని భారతీయులు క్షణాల్లో తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయొచ్చు. ఇది పూర్తిగా సురక్షితమైన విధానం. లావాదేవీల రుసుము కూడా తక్కువే. 365 రోజుల్లో ఎప్పుడైనా డబ్బు పంపొచ్చు’’ అని ఎన్‌పీసీఐ పేర్కొంది. దేశీయంగా రూపొందించిన యూపీఐ పద్ధతిలో ఇతర దేశాలకు డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించడం భారత ఆర్థిక వ్యవస్థ పరిధిని మరింత విస్తరింపచేస్తుందని ఎన్‌పీసీఐ ఆశాభావం వ్యక్తంచేసింది.

భారత్‌-సింగపూర్‌ల మధ్య డిజిటల్‌ లావాదేవీలు సులభతరం చేసే అనుసంధాన ప్రక్రియను గతేడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన యూపీఐ, సింగపూర్‌కు చెందిన పేనౌలను అనుసంధానించారు. తొలి విడతలో కేవలం వాణిజ్యపరమైన లావాదేవీలకు మాత్రమే అనుమతి ఉండేది. తాజాగా సాధారణ ఖాతాలకు నగదు బదిలీ చేసేందుకు అనుమతించారు. ప్రస్తుతం ఒక రోజులో రూ.60 వేల నగదు (వెయ్యి సింగపూర్‌ డాలర్లు) పంపొచ్చు. యూపీఐ ద్వారా సింగపూర్‌లో ఉన్న వారికి నగదు పంపాలంటే.. పేనౌకు అనుసంధానించిన ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి డబ్బు పంపొచ్చు. అలాగే, సింగపూర్‌ నుంచి భారత్‌కు బదిలీ చేయాలంటే.. పేనౌ యాప్‌లో యూపీఐ ఐడీ టైప్‌ చేసి నగదు బదిలీ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని