Treaty of Russia: మన దేశంలో ఎస్‌జే-100 విమానాల తయారీ

Eenadu icon
By Business News Desk Published : 29 Oct 2025 02:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హెచ్‌ఏఎల్‌తో రష్యా ఒప్పందం

దిల్లీ: మనదేశంలోనూ ప్రయాణికుల విమానాలు తయారీ చేయాలన్న ఆకాంక్ష నెరవేరేందుకు మార్గం సుగమం అయ్యింది. తక్కువ దూరం ప్రయాణాలకు ఉపయోగపడే, 2 ఇంజిన్ల న్యారోబాడీ ఎస్‌జే-100 విమానాలను తయారు చేసే రష్యా కంపెనీ యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ (పీజేఎస్‌సీ-యూఏసీ)తో మన ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (హెచ్‌ఏఎల్‌) ఒప్పందం కుదుర్చుకోవడం ఇందుకు నేపథ్యం. ఈ ఒప్పందం ప్రకారం ఎస్‌జే-100 విమానాలను మనదేశంలోనూ తయారు చేస్తారు. ఇప్పటివరకు ఈ మోడల్‌ విమానాలు 200 తయారవ్వగా, 16 విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. భారత్‌లో ప్రయాణికుల కోసం ఈ విమానాలను తయారు చేసే హక్కులు హెచ్‌ఏఎల్‌కు లభిస్తున్నాయి. ‘దేశంలో ఎస్‌జే-100 విమానాల తయారీ భారత విమానయాన పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. రానున్న పదేళ్లలో ప్రాంతీయ అనుసంధానత పథకం (ఉడాన్‌) కింద ఎస్‌జే-100 వంటి చిన్న పరిమాణం కలిగిన 200 విమానాలు అవసరమవుతాయని భావిస్తున్నాం. హిందూ మహాసముద్ర ప్రాంత పర్యాటక ప్రదేశాలకు సేవలందించేందుకు మరో 350కు పైగా విమానాలు అవసరం. పౌర విమానయాన రంగంలో మనదేశం ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుంది’ అని హెచ్‌ఏఎల్‌ పేర్కొంది. 103 మంది వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ విమానం.. స్వల్ప దూర గమ్యాలకు అనువుగా ఉంటుంది. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. మాస్కోలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌ సీఎండీ డీకే సునీల్, పీజేఎస్‌సీ-యూఏసీ డైరెక్టర్‌ జనరల్‌ వాది బదేఖా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని