Mark Zuckerberg: గూగుల్‌ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్‌ గాలం?

Mark Zuckerberg: మార్కెట్‌లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్‌ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్‌ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం.

Published : 28 Mar 2024 12:47 IST

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ (Artificial intelligence - AI) టెక్‌ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీకి ఉండే ఆదరణ అంతాఇంతా కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. సర్వం ఏఐమయమౌతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో టెక్‌ కంపెనీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఏఐ ఆధారిత ఉత్పత్తుల రూపకల్పనకు సిద్ధమయ్యాయి. డిమాండ్‌కు తగిన స్థాయిలో నిపుణుల సరఫరా లేకపోవటం తలనొప్పిగా మారింది. ఈనేపథ్యంలో ఇతర కంపెనీల్లోని ప్రొఫెషనల్స్‌కు గాలం వేస్తున్నాయి.

తాజాగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ మాతృసంస్థ మెటా (Meta) సైతం ఇతర కంపెనీల్లోని ఏఐ నిపుణులను ఆకర్షించే పనిలో పడిందని వార్తలు వస్తున్నాయి. స్వయంగా కంపెనీ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) పలువురికి వ్యక్తిగతంగా ఈమెయిల్స్‌ పంపుతున్నట్లు సమాచారం. గూగుల్‌లో (Google) కృత్రిమ మేధ విభాగం డీప్‌మైండ్‌లో పనిచేస్తున్న కీలక ప్రొఫెషనల్స్‌ను సైతం ఆయన సంప్రదించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే వేతనం, ఇతరత్రా ప్రోత్సాహకాలపై ఆయన వారికి హామీ ఇస్తున్నట్లు చెప్పారు.

మెటా తమ ఏఐ కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. తమ ప్లాట్‌ఫామ్‌లో వీడియో రికమండేషన్లను పూర్తిగా ఏఐతో అనుసంధానం చేయాలనుకుంటున్నట్లు చెప్పాయి. కేవలం రీల్స్‌ మాత్రమే కాకుండా మొత్తం వీడియోలకు ఒకే ఏఐ మోడల్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇటీవల ఫేస్‌బుక్‌ హెడ్‌ టామ్‌ అలిసన్‌ వెల్లడించారు. దీనికే రికమండేషన్‌ వ్యవస్థను సైతం అనుసంధానిస్తామని తెలిపారు. తద్వారా యూజర్ల అభిరుచులకు అనుగుణంగా కంటెంట్‌ను అందించడంతో పాటు ప్లాట్‌ఫామ్‌ స్పందన సైతం మెరుగవుతుందని వివరించారు.

ఇప్పటికే రీల్స్‌, గ్రూప్స్‌, ఫీడ్‌ వంటి ఫీచర్ల కోసం మెటా వివిధ రకాల ఏఐ మోడల్స్‌ను ఉపయోగిస్తోంది. వీటన్నింటిలో రికమండేషన్లను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడంలో భాగంగా ఇటీవల అత్యాధునిక ఏఐ మోడల్స్‌ను పరీక్షిస్తోంది. కానీ, మెటాను కంప్యూటర్‌ చిప్‌ల కొరత వేధిస్తోంది. 2023లో 4.5 బిలియన్‌ డాలర్లు వెచ్చించి ఎన్వీడియా నుంచి హెచ్‌100 చిప్‌లను కొనుగోలు చేసింది. ఇటీవల బీ200 చిప్‌ విడుదలైన నేపథ్యంలో వీటినీ సమకూర్చుకునే యత్నాల్లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని