Stock Market today: షాక్‌ మార్కెట్‌..!

స్టాక్‌ మార్కెట్‌కు ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ కట్టిన ఆశల పల్లకి కుప్పకూలింది. వాస్తవ ఫలితాల్లో ఏ పార్టీకీ ఓటరు స్పష్టమైన సాధారణ మెజారిటీ ఇవ్వకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ఇదే వేగంతో కొనసాగవనే సందేహాలతో,

Updated : 05 Jun 2024 07:51 IST

సోమవారం ఎగసి.. అంతకు రెట్టింపుస్థాయిలో కుప్పకూలిన మార్కెట్లు
ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా ఓటరు తీర్పు ఫలితం
సెన్సెక్స్‌కు ఒక్కరోజే 4390 పాయింట్ల నష్టం 
22,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
రూ.31.07 లక్షల కోట్ల సంపద ఉఫ్‌ 

స్టాక్‌ మార్కెట్‌కు ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ కట్టిన ఆశల పల్లకి కుప్పకూలింది. వాస్తవ ఫలితాల్లో ఏ పార్టీకీ ఓటరు స్పష్టమైన సాధారణ మెజారిటీ ఇవ్వకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ఇదే వేగంతో కొనసాగవనే సందేహాలతో, మదుపర్లు మంగళవారం ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు.. ఫలితంగా స్టాక్‌మార్కెట్ల చరిత్రలోనే చవిచూడని భారీనష్టాలను చూడాల్సి వచ్చింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సూచీల పతనం తీవ్రత తగ్గినా.. అప్పటికే నష్టం జరిగిపోయింది.

  • స్టాక్‌మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఒకరోజు లాభం సోమవారం నమోదు కాగా.. ఆ ఆనందం, 24 గంటల్లోనే కరిగిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ భాజపాకు సొంతంగా వచ్చే సంకేతాలు కనపడకపోవడంతో, ఉదయం నుంచే మదుపర్లు ఒక్కసారిగా షేర్ల అమ్మకాలకు దిగారు. ఫలితంగా చరిత్రలోనే అతిపెద్ద ఒకరోజు నష్టాన్ని సెన్సెక్స్‌ చవిచూసింది.

  • కొవిడ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించిన 2020 మార్చి 23న సెన్సెక్స్‌కు 3935 పాయింట్ల భారీనష్టమే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ఇప్పుడు అంతకుమించి పతనమైంది. ఎఫ్‌ఎమ్‌సీజీ మినహా అన్ని రంగాల షేర్లు నేలచూపులు చూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 37 పైసలు క్షీణించి 83.51 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • సూచీల నష్టాల నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.31.07 లక్షల కోట్లు తగ్గి రూ.394.83 లక్షల కోట్ల (4.73 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది.
  • రూ.20 లక్షల కోట్ల దిగువకు రిలయన్స్‌ విలువ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లకూ భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఫలితంగా ఇంట్రాడేలో 10% కుప్పకూలిన షేరు రూ.2,719.15 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 7.53% నష్టంతో రూ.2,793.60 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.54 లక్షల కోట్లు తగ్గి రూ.18.90 లక్షల కోట్లకు చేరింది.
  • పీఎస్‌యూ షేర్లు విలవిల: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) షేర్లు నష్టాలతో విలవిలలాడాయి. ఆర్‌ఈసీ 24.07%, పీఎఫ్‌సీ 21.62%, కంటైనర్‌ కార్పొరేషన్‌    19.43%, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ 19.21%, ఓఎన్‌జీసీ 16.23%, కోల్‌ ఇండియా 13.54%, ఎన్‌టీపీసీ 14.52%, పవర్‌గ్రిడ్‌ 11.98% పతనమయ్యాయి. 
  • ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు: యూనియన్‌ బ్యాంక్‌ 17.65%, బీఓబీ 15.74%, పీఎన్‌బీ 15.15%, కెనరా బ్యాంక్‌ 13.45%, ఎస్‌బీఐ 13.37% పడ్డాయి. బ్యాంక్‌ నిఫ్టీ 4051.35 పాయింట్లు తగ్గి 46,928.60 వద్ద ముగిసింది.


మంగళవారం ట్రేడింగ్‌ సాగిందిలా..

  • ఉదయం 9 నుంచి 11 గంటలు: సెన్సెక్స్‌ ఉదయం 76,285.78 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. భాజపాను నిరాశపరుస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చే కొద్దీ, స్టాక్‌మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి.
  • ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట: భాజపాకు పూర్తి మెజారిటీ రాదని స్పష్టం కావడంతో, మదుపర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 6234 పాయింట్లు క్షీణించి, 70,234.43 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. 
  • మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 గంటలు: భాజపా సొంతంగా కాకపోయినా, ఎన్‌డీఏ పక్షాలతో సాధారణ మెజారిటీని అధిగమించే వీలుండటంతో, సూచీలు కాస్త కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకున్నా.. భారీ నష్టాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాయి. సెన్సెక్స్‌ 4389.73 పాయింట్ల (5.74%) నష్టంతో 72,079.05 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్ఠస్థాయి. నిఫ్టీ 1379.40 పాయింట్లు (5.93%) కుదేలై 21,884.50 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,281.45- 23,179.50 పాయింట్ల మధ్య కదలాడింది. 
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 కుప్పకూలాయి. రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్‌ 14.40%, విద్యుత్‌ 14.25%, చమురు-గ్యాస్‌ 13.07%, సేవలు 12.65%, యంత్ర పరికరాలు 12.06%, ఇంధన 11.62%, లోహ 9.65% కుదేలయ్యాయి. బీఎస్‌ఈలో 3,349 షేర్లు నష్టాల్లో ముగియగా, 488 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 97 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. 292 షేర్లు 52 వారాల కనిష్ఠానికి చేరగా, 139 షేర్లు ఏడాది గరిష్ఠానికి చేరాయి. 
  • బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 8.07%, స్మాల్‌క్యాప్‌ సూచీ 6.79% పతనమయ్యాయి.
  • క్రోనాక్స్‌ ఐపీఓ రెండో రోజుకు 24.57 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 66,99,000 షేర్లను ఆఫర్‌ చేయగా, 16,45,99,160 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు