Stock Market: దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు.. ₹400 లక్షల కోట్లు దాటిన మదుపర్ల సంపద

Stock Market: సెన్సెక్స్‌-30 సూచీ 500 పాయింట్లకు పైగా పుంజుకొని 74,751 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ సైతం 22,658 దగ్గర తాజా రికార్డును నమోదు చేసింది.

Updated : 08 Apr 2024 12:39 IST

దిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆశావహ సంకేతాలు, విదేశీ మదుపర్ల పెట్టుబడుల దన్నుతో మార్కెట్లు రాణిస్తున్నాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్‌-30 సూచీ దాదాపు 500 పాయింట్లు పుంజుకొని 74,751 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ సైతం 22,658 దగ్గర తాజా రికార్డును నమోదు చేసింది.

మధ్యాహ్నం 12:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ 486 పాయింట్లు పుంజుకొని 74,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 22,657 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌-30 సూచీలో మారుతీ, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

సూచీల ర్యాలీ నేపథ్యంలో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. గత జులైలో బీఎస్ఈ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.300 లక్షల కోట్లు తాకింది. అమెరికా మార్కెట్లు గతవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో మార్కెట్లు రాణిస్తుండడం గమనార్హం.

బంధన్‌ బ్యాంక్‌ షేర్లు డీలా..

ప్రైవేట్‌రంగ బంధన్‌ బ్యాంక్‌ షేర్లు సోమవారం ఆరంభంలో 9 శాతానికి పైగా కుంగి రూ.179 దగ్గర ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. ఎండీ, సీఈఓ చంద్రశేఖర్‌ ఘోష్‌ పదవీకాలం జులై 9తో ముగియనుందని.. ఆ తర్వాత ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని బ్యాంక్‌ తెలిపింది. తొమ్మిదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న ఆయన సంస్థలో మరింత వ్యూహాత్మక పాత్రను పోషించనున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని