Kohans Life sciences: కొహాన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌తో సువెన్‌ ఫార్మా విలీనం

కొహాన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌తో సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ విలీనానికి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు అనుమతి ఇచ్చినట్లు సువెన్‌ ఫార్మా గురువారం వెల్లడించింది.

Updated : 31 May 2024 04:08 IST

స్టాక్‌ ఎక్స్ఛేంజీల అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: కొహాన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌తో సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ విలీనానికి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు అనుమతి ఇచ్చినట్లు సువెన్‌ ఫార్మా గురువారం వెల్లడించింది. ఇక సెబీ అనుమతి రావడమే మిగిలి ఉంది. ఆ తర్వాత ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌)లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ వచ్చే 12 - 15 నెలల్లో పూర్తవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. తద్వారా మలిదశ వృద్ధి వ్యూహాలను వేగంగా అమలు చేసే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. వచ్చే అయిదేళ్లలో ఆదాయాలు రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సువెన్‌ ఫార్మా నిర్దేశించుకుంది. దీనికి కొహాన్స్‌ లైఫ్‌సైన్సెస్‌తో విలీనం దోహదపడుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ప్రొవిజన్ల కంటే ముందు ఆదాయం) పెరుగుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేగవంత వృద్ధి ఉంటుందని సువెన్‌ ఫార్మా ఎండీ డాక్టర్‌ వి.ప్రసాద రాజు తెలిపారు. ‘చైనా ప్లస్‌ వన్‌’ విధానాన్ని వివిధ దేశాలు అనుసరిస్తున్నందున, తమకు వ్యాపారావకాశాలు పెరుగుతున్నాయని అన్నారు.  

తగ్గిన లాభాలు: సువెన్‌ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.252.9 కోట్ల ఆదాయాన్ని, రూ.62.4 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.369.4 కోట్లు, నికరలాభం రూ.124 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం 32%, నికరలాభం 50% తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి ఈ సంస్థ  రూ.1,051 కోట్ల ఆదాయాన్ని, రూ.319 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23లో ఆదాయం    రూ.1,340 కోట్లు, నికరలాభం రూ.401 కోట్లు ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే ఆదాయం 21.6%, నికరలాభం 20.4% తగ్గాయి. కొవిడ్‌ మందుల అమ్మకాలు తగ్గడం, ‘షిప్‌మెంట్‌’ జాప్యం దీనికి ప్రధాన కారణాలని సువెన్‌ ఫార్మా యాజమాన్యం వివరించింది. 

పరిశోధన- అభివృద్ధి కేంద్రం: జీనోమ్‌ వ్యాలీలో నూతన పరిశోధన- అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించినట్లు యాజమాన్యం వెల్లడించింది. సూర్యాపేట యూనిట్లో కొత్త బ్లాకు ప్రారంభానికి సిద్ధం అవుతున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని