Meta: EU యూజర్ల డేటా అమెరికాకు బదిలీ.. మెటాపై రికార్డు జరిమానా

Meta: ఐరోపా సమాఖ్య (European Union) తరఫున పనిచేసే ‘ఐరిష్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ (DPC)’ మెటాపై జరిమానాను విధించింది.

Published : 22 May 2023 17:19 IST

లండన్‌: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా (Meta)పై ఐరోపా సమాఖ్య (European Union) రికార్డు స్థాయి జరిమానా విధించింది. డేటా బదిలీ విషయంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేల్చిన ఈయూ (EU).. 1.3 బిలియన్‌ డాలర్లు జరిమానాగా చెల్లించాలని మెటా (Meta)ను ఆదేశించింది. ఈయూ యూజర్ల డేటాను నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు బదిలీ చేసినట్లు ఆరోపించింది. దీన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

ఐరోపా సమాఖ్య (European Union) తరఫున పనిచేసే ‘ఐరిష్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ (DPC)’ ఈ జరిమానాను విధించింది. ఈ వ్యవహారంపై డీపీసీ 2020 నుంచి దర్యాప్తు చేస్తోంది. డేటా విషయంలో యూజర్ల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు ఉన్న ముప్పును పరిష్కరించడంలో మెటా విఫలమైందని డీపీసీ ఆరోపించింది. ఈ విషయంలో ‘కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ యురోపియన్‌ యూనియన్‌’ పూర్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని తెలిపింది.

ఈయూ (EU) నిర్ణయంపై మెటా (Meta) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమని ఈయూ ఒంటరిని చేసిందని ఆరోపించింది. ఈయూ (EU) తీర్పు సహేతుకంగా లేదని.. ఇది ఇతర కంపెనీలకు తప్పుడు సందేశమిస్తోందని పేర్కొంది. దీనిపై న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై మెటా గతంలో ఓసారి తీవ్రంగా స్పందించింది. ఎలాంటి కఠిన నిర్ణయాలు వెలువడినా.. ఈయూలో సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. అయితే, తాజా ఈయూ నిర్ణయం తర్వాత సేవల్లో ఎలాంటి అంతరాయం లేకపోవడం గమనార్హం.

డేటా ప్రైవసీ విషయంలో ఐదేళ్ల క్రితం డీపీసీ కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. వాటిని ఉల్లంఘించినందుకుగానూ 2021లో అమెజాన్‌పై 746 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని