Vistara: మా కంటే సాఫ్ట్‌వేర్‌నే ఎక్కువ నమ్ముతున్నారు.. విస్తారా పైలట్ల ఆందోళన!

Vistara: పైలట్లు అందుబాటులో లేకపోవటంతో గతకొన్ని రోజులుగా విస్తారా విమానాలు రద్దవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం వారితో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated : 04 Apr 2024 14:26 IST

దిల్లీ: కొంతమంది పైలట్లు సమ్మెబాట పట్టడంతో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు విస్తారా (Vistara) చర్యలు చేపట్టింది. బుధవారం ఈ మేరకు వారితో చర్చించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈఓ వినోద్‌ కన్నన్‌ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారని వెల్లడించాయి. ఈ సందర్భంగా పైలట్లు తమ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఎయిరిండియాలో విలీనం నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి విస్తారా (Vistara) పైలట్లకు కొత్త కాంట్రాక్టు అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంపై అసంతృప్తిగా ఉన్నందునే పైలట్లు విధులకు మూకుమ్మడిగా డుమ్మా కొట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పైలట్లు మాత్రం తాజా సమావేశంలో ఓ కీలక సమస్యను తెరపైకి తెచ్చినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. తమ పనిగంటలు అనుమతించిన గరిష్ఠ పరిమితికి చేరుతున్నాయని వారు చెప్పినట్లు పేర్కొన్నాయి. ‘‘అధిక పనిగంటల వల్ల తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా పరిమితికి మించి సిక్‌ లీవ్‌లు తీసుకోవాల్సి వస్తోంది. చాలా మంది వేతనాన్ని వదులుకొని మరీ సెలవు పెడుతున్నారు. అయితే, మేమంతా కూడబలుక్కొని డుమ్మా కొడుతున్నామనేది మాత్రం నిజం కాదు’’ అని వారు చెప్పినట్లు సమాచారం.

మరోవైపు యాజమాన్యం తమ కంటే సాఫ్ట్‌వేర్‌నే ఎక్కువగా విశ్వసిస్తోందని పైలట్లు వాపోయినట్లు తెలుస్తోంది. ‘‘విధుల్లో ఉన్నప్పుడు అలసిపోతే వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు ‘బోయింగ్‌ అలర్ట్‌నెస్‌ మోడల్‌’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా విమాన స్థితిని పరిశీలిస్తున్నారు. అంతా బాగానే ఉందని, మీరు ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదని చెబుతున్నారు’’ అని వివరించారు. మరోవైపు కచ్చితమైన వేతన పనిగంటలను 70 నుంచి 40కి తగ్గించడం వల్ల పైలట్లకే ప్రయోజనం ఎక్కువని యాజమాన్యం ఈ సమావేశంలో పేర్కొంది. దీని వల్ల ఎక్కువ పనిచేసుకునే వెసులుబాటు ఉంటుందని. తద్వారా అధికంగా ఆర్జించొచ్చని వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత రెండు రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా (Vistara) రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా చర్చలు జరుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని