Israel - Hamas: ఇజ్రాయెల్‌లోని ఉద్యోగుల భద్రతపై టెక్‌ కంపెనీల ఆందోళన

ఇజ్రాయెల్‌ - పాలస్తీనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతపై టెక్‌ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలు ట్వీట్‌లు చేశారు.

Published : 11 Oct 2023 16:48 IST

కాలిఫోర్నియా: ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ మిలిటెంట్ల దాడి వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) తెలిపారు. ఈ దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భద్రతపై కంపెనీ దృష్టి సారించినట్లు తెలిపారు. దాంతోపాటు ఇజ్రాయెల్‌లోని ఉద్యోగుల కోసం ఆయన ప్రత్యేక సందేశాన్ని షేర్‌ చేశారు. 

‘‘ఇజ్రాయెల్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు, వారి కుంటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు కంపెనీలోని వేర్వేరు బృందాలు పనిచేస్తున్నాయి. వారితో సంప్రదింపులు జరుపుతూ.. కంపెనీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్‌ వైస్ ప్రెసిడెంట్‌ కాథలీన్ హోగన్‌ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మూడు వేల మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలానే, మైక్రోసాఫ్ట్‌లో ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాలకు చెందినవారు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారంతా స్వదేశాల్లోని తమ కుటుంబ సభ్యుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని, తమ వంతుగా వారికి అవసరమైన సాయం అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇజ్రాయెల్‌ కఠిన నిర్ణయం.. ‘నాక్‌ ఆన్‌ ది రూఫ్‌’ విధానానికి మంగళం..!

మరోవైపు గూగుల్ (Google) ఇజ్రాయెల్‌లోని తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) ఇజ్రాయెల్‌ - హమాస్‌ ఉద్రిక్తతలపై ( Israel - Hamas Conflict) బుధవారం ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్‌పై జరిగిన  ఉగ్రవాద దాడి ఎంతో బాధకు గురి చేసింది. అక్కడ రెండు వేల మంది మా కంపెనీ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. స్థానికంగా ఉన్న మా ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి కంపెనీ అండగా ఉంటుందని తెలిపాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే బృందాలకు మా వంతు సాయం అందిస్తాం’’ అని సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు