Inflation: ధరల కట్టడి కోసం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది: ఆర్‌బీఐ

Inflation: పండగ సీజన్‌లో నమోదైన బలమైన గిరాకీ నేపథ్యంలో అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో బలమైన వృద్ధి రేటు నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

Published : 16 Nov 2023 18:49 IST

ముంబయి: అధిక ధరల ఒత్తిళ్ల నుంచి భారత్‌ ఇంకా బయటపడలేదని ఆర్‌బీఐ (RBI) తెలిపింది. అయితే, గత రెండు నెలల్లో ద్రవ్యోల్బణం దిగిరావడం కాస్త ఉపశమనం కలిగించిందని పేర్కొంది. ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ’ పేరిట గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ వ్యాఖ్యలు చేసింది.

‘‘ద్రవ్యోల్బణం (Inflation) కట్టడి విషయంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. అయితే, సెప్టెంబరులో ఐదు శాతం, అక్టోబర్‌లో 4.9 శాతంగా నమోదవడం స్వాగతించాల్సిన విషయం. 2022- 23లో నమోదైన 6.7 శాతం, 2023 జులై-ఆగస్టులో రికార్డయిన 7.1 శాతం ద్రవ్యోల్బణంతో పోలిస్తే గత రెండు నెలల్లో ఉపశమనం లభించిందనే చెప్పాలి. అయితే, నవంబరు 13వరకు ఉన్న డేటా ప్రకారం చూస్తే పప్పు దినుసులు, తృణధాన్యాల ధరలు పెరిగాయి. అదే సమయంలో వంట నూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి’’ అని ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది.

భారత వృద్ధి దేశీయ గిరాకీపైనే ఆధారపడి ఉందని ఆర్‌బీఐ ధీమా వ్యక్తం చేసింది. దీని వల్ల బహిర్గత అంశాల అంశాల ప్రభావం స్వల్పంగా ఉంటుందని పేర్కొంది. నియంత్రిత ప్రస్తుత ఖాతా లోటు, బలమైన నగదు ప్రవాహం, స్థిరమైన కరెన్సీ, ఆరోగ్యకరమైన విదేశీ మారక నిల్వలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని వివరించింది. పండగ సీజన్‌లో నమోదైన బలమైన గిరాకీ నేపథ్యంలో అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో బలమైన వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేసింది. పెట్టుబడులు, మౌలిక వసతుల్లో ప్రభుత్వం వ్యయం, డిజిటలైజేషన్‌ వంటి అంశాలు సైతం దేశ వృద్ధి రేటు కొనసాగింపునకు దోహదం చేస్తాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని