Piyush Goyal: కెనడా నేతల్లో అపోహలతోనే.. ‘ఎఫ్‌టీఏ’ చర్చలకు బ్రేక్‌..!

భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల నిలిపివేతతో కెనడాకే ఎక్కువగా నష్టమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Published : 05 Nov 2023 15:58 IST

దిల్లీ: కెనడా నేతల్లో నెలకొన్న కొన్ని అపోహలతోనే భారత్- కెనడాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) చర్చలపై ప్రభావం పడినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తెలిపారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో గోయల్‌ మాట్లాడుతూ.. ‘ఇరుదేశాల మధ్య ఎఫ్‌టీఏ విషయంలో కొంతమంది కెనడా (Canada) రాజకీయవేత్తల్లో అపోహలు నెలకొన్నాయి. అయితే, అవన్నీ నిరాధారమైనవే’ అని పేర్కొన్నారు. చర్చల నిలిపివేతతో కెనడాకే ఎక్కువగా నష్టమని.. భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అని, ఇక్కడ అనేక అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. మరోవైపు బ్రిటన్‌ (Britain)తో ఎఫ్‌టీఏ చర్చలు స్థిరంగా సాగుతున్నట్లు వెల్లడించారు. అయితే, కెనడా నేతల అపోహలేంటో కేంద్ర మంత్రి వెల్లడించలేదు.

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసుతో భారత్‌ - కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఫలితంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు బ్రేక్ పడింది. వాస్తవానికి జీ-20 సదస్సుకు కొద్ది రోజుల ముందే భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రకటించింది. నవంబరులో ఆ చర్చలను తిరిగి ప్రారంభించాల్సి ఉండగా.. వాయిదా పడింది. అయితే.. వాణిజ్య చర్చలను పునఃప్రారంభించేందుకు భారత్‌ ఆసక్తిగా ఉందని కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్‌ కుమార్‌ వర్మ తాజాగా తెలిపారు. కెనడా వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారత్‌ స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

నిజ్జర్‌ హత్య దర్యాప్తును తారుమారు చేస్తున్నారు.. భారత్‌ రాయబారి ఆరోపణ..!

ఇరు దేశాల మధ్య అత్యధిక వస్తువులపై కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించడం లేదా తగ్గించడం, పెట్టుబడులను ఆకర్షించేలా వాణిజ్య నిబంధనలను సరళీకరించడం ఈ చర్చల ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందంతో టెక్స్‌టైల్‌, లెదర్‌ వంటి ఉత్పత్తులపై సుంకాలను తొలగించుకోవడంతోపాటు వీసా నిబంధనలను కూడా సులభతరం చేసుకోవచ్చని భారత్‌ భావిస్తోంది. అటు భారత్‌ నుంచి డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకు దిగుమతి చేసుకోవచ్చన్న ఆశయంతో కెనడా ఈ చర్చలు ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని