Mobile payments: 2028లో రూ.531 లక్షల కోట్లు దాటనున్న మొబైల్‌ చెల్లింపులు!

Mobile payments: భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులకు ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. ఈనేపథ్యంలో 2024-2028 మధ్య మొబైల్‌ లావాదేవీల విలువ 18.3 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని ఓ ప్రముఖ సంస్థ అంచనా వేసింది.

Published : 08 Apr 2024 15:17 IST

దిల్లీ: భారత్‌లో మొబైల్‌ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. నగదు, కార్డు ద్వారా చేసే లావాదేవీలు తగ్గిపోతున్నాయి. దీంతో మొబైల్‌ ద్వారా చేసే చెల్లింపుల (Mobile Payments) విలువ 2028లో రూ.531.8 లక్షల కోట్లు దాటుతుందని లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న డేటా అనలిటిక్స్‌ సంస్థ గ్లోబల్‌డేటా అంచనా వేసింది. 2024 నుంచి 2028 మధ్య 18.3 సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు (CAGR) నమోదవుతుందని అంచనా వేసింది.

గ్లోబల్‌ డేటా గణాంకాల ప్రకారం 2019-2023 మధ్య మొబైల్‌ ద్వారా చేసిన చెల్లింపుల (Mobile Payments) విలువ 72.1 శాతం సీఏజీఆర్‌తో రూ.202.8 లక్షల కోట్లకు చేరింది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని గ్లోబల్‌డేటా పేర్కొంది. ముఖ్యంగా యూపీఐ పాత్ర చాలా కీలకమని అభిప్రాయపడింది. వేగం, భద్రత, సౌలభ్యం, తక్కువ ఖర్చు వంటి ప్రయోజనాల వల్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని వివరించింది.

ఎన్‌పీసీఐ వివరాల ప్రకారం ఫిబ్రవరిలో యూపీఐ (UPI) లావాదేవీల విలువ రూ.18.3 లక్షల కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ మొత్తం రూ.12.4 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు 2023 కేలండర్‌ ఏడాది ద్వితీయార్ధంలో యూపీఐ చెల్లింపుల సంఖ్య 56 శాతం పెరిగింది. విలువపరంగా 44 శాతం వృద్ధితో రూ.99.68 లక్షల కోట్లకు చేరింది. ఒక్కో యూపీఐ లావాదేవీ సగటు విలువ 8 శాతం పెరిగి రూ.1,648గా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు