Modi: ఇప్పుడు ఇంటిపేరు మ్యాటర్ కానేకాదు: జొమాటో సీఈఓ వీడియోపై మోదీ పోస్టు

ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌ (Deepinder Goyal)ను ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసించారు. ఆయన ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ప్రేరణనిస్తుందని కొనియాడారు. 

Updated : 22 May 2024 10:21 IST

దిల్లీ: నేటి భారతంలో ఇంటిపేరుతో పట్టింపు లేదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జొమాటో ప్రారంభ రోజుల నాటి అనుభవాలను ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్‌ (Deepinder Goyal) వివరించారు. ప్రభుత్వ సహకారంతో చిన్న పట్టణానికి చెందిన కుర్రాడు కూడా జొమాటో వంటి సంస్థను స్థాపించడం సాధ్యమవుతుందని తాను నిరూపించినట్లు చెప్పారు. దానికి సంబంధించిన వీడియోను రీపోస్టు చేస్తూ మోదీ స్పందించారు.

‘‘నేటి భారతంలో ఇంటి పేరుతో పట్టింపు లేదు. శ్రమించడమే ఇక్కడ ముఖ్యం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మీ ప్రయాణం ఒక ప్రేరణ, స్ఫూర్తిదాయకం. స్టార్టప్‌ల అభివృద్ధి కోసం అనుకూల వాతావరణాన్ని అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri) నిర్వహించిన ‘విశేష్ సంపర్క్’ కార్యక్రమంలో గోయల్‌ పాల్గొని ప్రసంగించారు. స్టార్టప్‌ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చిన వెంటనే తన తండ్రితో చర్చించానని చెప్పారు. అప్పుడు ఆయన..‘‘నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా..? ఇంత చిన్న ఊరిలో మనం ఏమీ చేయలేం. అది అసాధ్యం’’ అని సందేహం వ్యక్తం చేశారని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో తన కల సాకారమైందని, 2008లో సంస్థను స్థాపించినప్పటి నుంచి నేటి వరకు లక్షలాది మందికి ఉపాధి కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియోను కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి ‘ఎక్స్‌’(ట్విటర్‌) వేదికగా షేర్ చేయగా.. దానికి ప్రధాని మోదీ బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు