విమానయానం.. మూడు నెలల్లో 9.7 కోట్ల మంది!

2024 మొదటి త్రైమాసికంలో మొత్తం ఏకంగా 9.7 కోట్ల మంది విమానంలో ప్రయాణించారు. 

Published : 17 May 2024 23:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద సంఖ్యలో భారతీయులు విమానాల్లో ప్రయాణిస్తున్నారు. 2024 మొదటి త్రైమాసికంలోనే మొత్తం (దేశీయంగా, అంతర్జాతీయంగా) ఏకంగా 9.7 కోట్ల మంది ప్రయాణించారు. ప్రయాణ తీరుతెన్నులను అంచనా వేసేందుకు గాను ‘ట్రావెల్‌ ట్రెండ్స్‌ 2024: బ్రేకింగ్‌ బౌండరీస్‌’ పేరుతో మాస్టర్‌ కార్డ్‌ ఎకనామిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (MEI) 74 దేశాల్లో సర్వే చేపట్టింది. దాని ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

రూట్‌ కెపాసిటీ విస్తరణతోపాటు మధ్యతరగతి ప్రయాణికుల విశేష ఆదరణతో.. గతంలోకన్నా ఎక్కువమంది భారతీయులు ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రయాణిస్తున్నారు. 2024 మొదటి మూడు నెలల్లో ఏకంగా 9.7 కోట్ల మంది ప్రయాణికులు భారతీయ విమానాశ్రయాల ద్వారా రాకపోకలు సాగించారు. ఈ గణాంకాలు సాధించేందుకు పదేళ్ల క్రితం ఒక ఏడాది సమయం పట్టేది. ఈ ఏడాదిలో కేవలం ఒక త్రైమాసికంలోనే ఆ గరిష్ఠాలను చేరాయి.

దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 2019తో పోలిస్తే 21శాతం వృద్ధి చెందగా.. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 4శాతం పెరిగింది. అదే సమయంలో జపాన్‌ వెళ్లేవారు 53శాతం పెరగ్గా, వియత్నాంను సందర్శించిన వారి సంఖ్య ఏకంగా 248 శాతం వృద్ధి చెందింది. అమెరికాకు వెళ్లేవారు 59శాతం పెరిగారని ఆ నివేదిక తెలిపింది. అంతేకాదు ఈ వేసవిలో (జూన్‌- ఆగస్టు 2024) విమాన బుకింగ్‌ ప్రకారం చూసుకుంటే ఆమ్‌స్టర్‌డామ్‌, సింగపూర్‌, లండన్‌, మెల్‌బోర్న్‌ ప్రదేశాలను భారతీయ ప్రయాణికులు ఎక్కువగా సందర్శించనున్నారని ఆ నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని