Stock Market: లాభాల హ్యాట్రిక్‌

వరుసగా మూడోసారీ ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు నరేంద్ర మోదీ అభ్యర్థిత్వాన్ని ఎన్‌డీఏ కూటమి బలపరచడం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) పెంచడంతో దేశీయ సూచీలు శుక్రవారం జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి.

Updated : 08 Jun 2024 02:14 IST

తాజా రికార్డు గరిష్ఠాలకు సెన్సెక్స్, నిఫ్టీ
రాణించిన బ్యాంకింగ్, స్థిరాస్తి, వాహన షేర్లు
3 రోజుల్లో పెరిగిన సంపద రూ.28.65 లక్షల కోట్లు

వరుసగా మూడోసారీ ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు నరేంద్ర మోదీ అభ్యర్థిత్వాన్ని ఎన్‌డీఏ కూటమి బలపరచడం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) పెంచడంతో దేశీయ సూచీలు శుక్రవారం జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఐటీ కంపెనీలతో పాటు వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకింగ్, స్థిరాస్తి, వాహన షేర్లు పరుగులు తీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు పెరిగి 83.39 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై లాభపడగా, టోక్యో, హాంకాంగ్‌ నష్టపోయాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత మూడు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.28.65 లక్షల కోట్లు పెరిగి రూ.423.49 లక్షల కోట్ల (దాదాపు 5.08 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. సోమవారం రూ.13.78 లక్షల కోట్లు లాభపడగా, మంగళవారం మదుపర్ల సంపద రూ.31 లక్షల కోట్లకు పైగా హరించుకు పోయిన సంగతి విదితమే. మొత్తంమీద ఈవారంలో సంపద విలువ రూ.11.36 లక్షల కోట్ల మేర పెరగడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు.

వారం సెన్సెక్స్‌ పెరిగిన/తగ్గిన  సంపద విలువ

సోమవారం +2507 +రూ.13.78 లక్షల కోట్లు

మంగళవారం -4390 -రూ.31.07 లక్షల కోట్లు 

బుధవారం +2303 +రూ.13.22 లక్షల కోట్లు 

గురువారం +692 + రూ.7.83 లక్షల కోట్లు

శుక్రవారం +1618 + రూ.7.60 లక్షల కోట్లు

ఈ వారం +2730 + రూ. 11.36 లక్షల కోట్లు


వడ్డీ ఆధారిత షేర్ల హవా

ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో వడ్డీ రేట్ల ఆధారిత షేర్లు దూసుకెళ్లాయి. వాహన షేర్లలో మహీంద్రా 5.83%, టాటా మోటార్స్‌ 3.44%, అపోలో 2.97%, అశోక్‌ లేలాండ్‌ 2.46%, మారుతీ 0.94%, ఎంఆర్‌ఎఫ్‌ 0.93% పెరిగాయి. స్థిరాస్తి షేర్లలో శోభా 6.45%, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 4.96%, మ్యాక్రోటెక్‌ 3.51%, మహీంద్రా లైఫ్‌స్పేస్‌ 3.07%, గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ 2.84%, డీఎల్‌ఎఫ్‌ 1.80% లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ షేర్లలో ఎస్‌బీఐ 1.59%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.29%, ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ 1.24%, కోటక్‌ బ్యాంక్‌ 1.04%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.01%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.88% మెరిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 75,031.79 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్లు స్థిరంగా కొనసాగడంతో ఇంట్రాడేలో 1720.8 పాయింట్లు లాభపడి 76,795.31 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 1,618.85 పాయింట్ల లాభంతో 76,693.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 468.75 పాయింట్లు పెరిగి 23,290.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,789.05- 23,320.20 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లు దుమ్మురేపాయి. ఎం అండ్‌ ఎం 5.83%, విప్రో 5.09%, టెక్‌ మహీంద్రా 4.50%, ఇన్ఫోసిస్‌ 4.13%, టాటా స్టీల్‌ 4.04%, భారతీ ఎయిర్‌టెల్‌ 3.94%, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.86%, అల్ట్రాటెక్‌ 3.63%, టైటన్‌ 3.61%, టాటా మోటార్స్‌ 3.44%, ఎన్‌టీపీసీ 3.06%, పవర్‌గ్రిడ్‌ 2.95%, రిలయన్స్‌ 2.64% రాణించాయి. రంగాల వారీ సూచీల్లో.. టెలికాం 3.78%, ఐటీ 3.38%, టెక్‌ 3.33%, వాహన 2.53%, యుటిలిటీస్‌ 2.18%, లోహ 2.15%, ఇంధన 1.99, వినియోగ 1.94% లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 2890 షేర్లు లాభపడగా, 970 స్క్రిప్‌లు నష్టపోయాయి. 92 షేర్లలో ఎటువంటి మార్పులేదు.


జూన్‌ 4న సాంకేతిక లోపాలేం చోటుచేసుకోలేదు: బీఎస్‌ఈ 

ఈ నెల 4న మ్యూచువల్‌ ఫండ్లు కొనుగోలు చేసిన మదుపర్లకు, నికర ఆస్తి విలువ (ఎన్‌ఏవీ) కేటాయించడంలో జాప్యానికి.. బ్యాంకులు చెల్లింపులు తీసుకోవడంలో ఆలస్యమే కారణమని, తమ వైపు నుంచి ఎటువంటి సాంకేతిక లోపాలు లేవని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) శుక్రవారం స్పష్టం చేసింది. పొజిషన్ల నుంచి బయటకు రావడంలో విఫలమయ్యామని చాలా మంది మదుపర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో బీఎస్‌ఈ ఈ విధంగా స్పందించింది.

  • కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ పోర్ట్‌ వద్ద కంటైనర్‌ కేంద్ర కార్యకలాపాలు, నిర్వహణను అయిదేళ్ల పాటు చేపట్టే కాంట్రాక్ట్‌ లభించినట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌) వెల్లడించింది.
  • శ్రీలంకలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు 1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8300 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ దేశంలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రత్యక పెట్టుబడి,  అతిపెద్ద విద్యుత్‌ ప్రాజెక్ట్‌ అని వెల్లడించాయి. 
  • ఈ నెలలో విస్తరించిన టెర్మినల్‌ 1 (టీ1)ను ప్రారంభించే అవకాశం ఉందని దిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహించే దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డయల్‌) పేర్కొంది. అంతర్జాతీయ రాకపోకల కోసం సామర్థ్యాలను పెంచేందుకు పనిచేస్తున్నామని సంస్థ సీఈఓ విదేహ్‌ కుమార్‌ అన్నారు. 
  • టొరెంట్‌ గ్రూప్‌ మార్కెట్‌ విలువ రెట్టింపు: టొరెంట్‌ గ్రూప్‌ మార్కెట్‌ విలువ శుక్రవారం 20 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.68 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. 2023 జూన్‌ 6న టొరెంట్‌ గ్రూప్‌ మార్కెట్‌ విలువ 10.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.90,230 కోట్లు)గా ఉండగా.. ఏడాదిలోనే రెట్టింపు కావడం విశేషం. శుక్రవారం బీఎస్‌ఈలో టొరెంట్‌ ఫార్మా షేరు 2.22%, టొరెంట్‌ పవర్‌ షేరు 2.59% లాభపడ్డాయి. బలమైన ఆర్థిక ఫలితాలు, భవిష్యత్‌ వృద్ధి అంచనాలు, అన్ని విభాగాలు మెరుగ్గా రాణిస్తుండటంతో ఈ కంపెనీల షేర్ల విలువలు స్థిరంగా పెరుగుతున్నాయి.

హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్లు విక్రయించిన డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: గత కొద్దిరోజుల్లో స్టాక్‌మార్కెట్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేరు ధర ఆకర్షణీయంగా పెరిగింది. ఇంతకుముందే ఈ షేర్లను కొని ఉంచుకున్న వారిలో కొందరు లాభాల స్వీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలోనే డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ నెల 4న 10.35 లక్షల హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్లు విక్రయించింది. డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన వివిధ పథకాల కింద 35.43 లక్షల హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్లు ఉన్నాయి. హెరిటేజ్‌ ఫుడ్స్‌ జారీ మూలధనంలథీ షేర్లు 3.82 శాతానికి సమానం. ఇందులో డీఎస్‌పీ స్మాల్‌ క్యాప్‌ పథకం కింద ఉన్న షేర్లలో 10.35 లక్షల షేర్లను విక్రయించారు. దీంతో ఈ కంపెనీలో డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌కు ఉన్న వాటా 2.70 శాతానికి తగ్గింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో రూ.661 ముగింపు ధర నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని