Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..

Expensive Cities: వార్షిక ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ధరలు సగటున 7.4 శాతం చొప్పున పెరిగాయని ఈఐయూ నివేదిక తెలిపింది.

Published : 30 Nov 2023 14:51 IST

హాంకాంగ్‌: ఈ ఏడాది అత్యంత ఖరీదైన నగరాలు (Most Expensive Cities)గా సింగపూర్‌, జూరిచ్‌ నిలిచాయని ‘ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (EIU)’ తెలిపింది. జూరిచ్‌ ఆరో స్థానం నుంచి ఎగబాకి సింగపూర్‌ సరసన చేరినట్లు పేర్కొంది. గత ఏడాది సింగపూర్‌తో పాటు తొలిస్థానంలో నిలిచిన న్యూయార్క్‌ ఈసారి మూడోస్థానానికి దిగజారింది. నిత్యావసర సరకులు, గృహోపకరణాలు, కొన్ని రకాల సేవల ధరలు పెరిగిన నేపథ్యంలోనే జూరిచ్‌ మళ్లీ ఖరీదైన నగరంగా మారిందని పేర్కొంది.

ఈఐయూ నివేదికలోని కీలకాంశాలు..

  • అత్యంత ఖరీదైన తొలి పది నగరాల జాబితాలో ఆసియా నుంచి సింగపూర్‌, హాంకాంగ్‌; ఐరోపా నుంచి జూరిచ్‌, జెనీవా, ప్యారిస్‌, కోపెన్‌హాగెన్‌; అమెరికా నుంచి న్యూయార్క్‌, లాస్‌ఏంజెలస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో; ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ ఉన్నాయి. అయితే, ఈ సర్వేను ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి ముందు నిర్వహించినట్లు ఈఐయూ తెలిపింది.
  • వార్షిక ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ధరలు సగటున 7.4 శాతం చొప్పున పెరిగాయని నివేదిక తెలిపింది. క్రితం ఏడాది నమోదైన 8.1 శాతంతో పోలిస్తే తగ్గినప్పటికీ.. 2017- 21 మధ్య కాలంతో పోలిస్తే మాత్రం ధరలు ఇంకా ఎగువ స్థాయిలోనే ఉన్నాయని తెలిపింది.
  • జాబితాలో అమెరికాకు చెందిన మూడు నగరాలు ఉన్నప్పటికీ.. ఉత్తర అమెరికాలోని నగరాల్లో సగటు నివాస ఖరీదు తగ్గిందని పేర్కొంది.
  • పశ్చిమ ఐరోపా నగరాల్లో నిత్యావసరాలు, దుస్తుల ధరలు పెరిగాయి. అలాగే కరెన్సీ విలువలు సైతం పెరగడంతో ఈ ప్రాంతం నుంచి నాలుగు నగరాలు జాబితాలో చేరాయి. 
  • రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ స్థానాలు జాబితాలో భారీగా కిందకు దిగజారాయి.
  • ప్రపంచవ్యాప్తంగా మొత్తం 173 నగరాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు ఈఐయూ తెలిపింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు