Women: ట్రెండ్‌ మారుతోంది.. మహిళల పెట్టుబడి ప్రాధాన్యం బంగారం కాదట..!

రియల్‌ ఎస్టేట్‌(Real Estate)లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో 83 శాతం మంది మహిళలు (Women) నగరాల్లో ఇంటి కొనుగోలుకు మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైంది.

Published : 05 Mar 2023 22:45 IST

దిల్లీ: మహిళల్లో(Women) చాలా మంది బంగారాన్ని (Gold) సంప్ర‌దాయ‌మైన పెట్టుబ‌డి (Investment)గా భావిస్తారు. అందుకే పండుగ‌లు, శుభ‌కార్యాలు వంటి సందర్భాల్లో బంగారాన్నికొనుగోలు చేస్తుంటారు. భారత్‌లో ఈ ధోరణి ఎక్కువ. అయితే, ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. మహిళలు బంగారానికి బదులు రియల్‌ ఎస్టేట్‌(Real Estate)లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. తాజాగా అనరాక్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నిర్వహించిన కన్జ్యూమర్‌ సర్వేలో ఎక్కువ మంది మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సర్వేలోపాల్గొన్న వారిలో 65 శాతం మంది పెట్టుబడి కోసం రియల్‌ ఎస్టేట్‌ తమ మొదటి ఎంపికగా చెప్పినట్లు సంస్థ నివేదికలో పేర్కొంది. మరో 20 శాతం మంది స్టాక్‌ మార్కెట్‌ (Stock Market)పై, 8 శాతం మంది మాత్రమే బంగారం కొనుగోలుకు, మరో ఏడు శాతం మంది  ఫిక్స్‌డ్‌ డిపాజిల (Fixed Deposits)పై ఆసక్తి ఉందని వెల్లడించారు. 

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో 83 శాతం మంది మహిళలు నగరాల్లో ఇంటి కొనుగోలుకు మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైంది. వీరిలో 36 శాతం మంది రూ. 45 లక్షల నుంచి రూ. 90 లక్షల బడ్జెట్‌లో, 27 శాతం మంది రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్లు బడ్జెట్‌, 20 శాతం మంది రూ. 1.5 కోట్లు కన్నా ఎక్కువ బడ్జెట్‌లో ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు నివేదికలో పేర్కొంది. 

‘‘గత దశాబ్ద కాలంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మహిళా కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నగరాల్లో పెద్ద ఇళ్లు కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. మిలినియల్స్‌ తరహాలో మహిళలు కూడా తమకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేసే విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడంలేదు. మహిళల పేరుతో ఇళ్లు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY) ద్వారా లబ్ది చేకూరుతుండటం మరో కారణం. అంతేకాకుండా బ్యాంకులు పురుషులతో పోలిస్తే మహిళలకు ఎక్కువ రాయితీతో రుణాలు అందిస్తున్నాయి. ఉద్యోగం చేసే మహిళలకు పన్ను చెల్లింపుల సమయంలో భర్తతోపాటు పన్ను రాయితీ లభిస్తుందనే ఉద్దేశంతో వారిని  మరో యజమానిగా చూపిస్తూ ఇంటిని కొనుగోలు చేస్తున్నారు’’ అని అనరాక్‌ వైస్‌ ఛైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని