Elon Musk: మస్క్‌ మనసులో బ్యాంక్‌.. ‘ఎక్స్‌’ ఉద్యోగులకు టార్గెట్‌!

Elon Musk: సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’పై ఎలాన్‌ మస్క్‌ తన భవిష్యత్‌ ప్రణాళికలను ఆవిష్కరించారు. కంపెనీని సొంతం చేసుకొని ఏడాది గడిచిన సందర్భంగా ఉద్యోగులతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు.

Published : 27 Oct 2023 17:34 IST

Elon Musk | కాలిఫోర్నియా: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌.. బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేతికి వెళ్లి ఏడాది గడుస్తోంది. ఈ సంవత్సర కాలంలో పేరుతో సహా ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ అనేక మార్పులకు లోనైంది. ప్రీమియం ఫీచర్లు, వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌లు ఇలా చాలా రకాలుగా ఈ మెసేజింగ్‌ యాప్‌ (X) రూపాంతరం చెందింది. రానున్న రోజుల్లో మరిన్ని భారీ మార్పులు రాబోతున్నట్లు తాజాగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ మస్క్‌ (Elon Musk) వెల్లడించారు. పూర్తిగా ‘ఎక్స్‌ (X)’ స్వరూపమే మారనుందని తన భవిష్యత్‌ ప్రణాళికలను ఆవిష్కరించారు. 

దాదాపు ఒక బ్యాంక్‌కు సమానంగా ఎక్స్‌ (X)ను తీర్చిదిద్దనున్నట్లు మస్క్‌ (Elon Musk) తన ప్లాన్స్‌ను బయటపెట్టారు. ఒక పూర్తి స్థాయి ఆర్థిక కేంద్రంగా ఈ యాప్‌ను మార్చనున్నట్లు తెలిపారు. ఆర్థికం అంటే కేవలం ఆన్‌లైన్‌ లావాదేవీలు, చెల్లింపులు మాత్రమే కాదన్నారు. ఒక మనిషి ఆర్థిక జీవితం మొత్తానికి ఎక్స్‌ (X)ను అడ్డాగా మార్చాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. డబ్బులు, సెక్యూరిటీలు.. ఇలా దేనికైనా తమ యాప్‌ కేంద్రంగా మారాలని అన్నారు. అసలు బ్యాంక్‌ ఖాతానే అవసరం లేకుండా మనిషి జీవితంలో ఎక్స్‌ (X) భాగమై పోవాలని తన ఆలోచనలను ఆవిష్కరించారు. ఈ క్రమంలో 2024 ముగిసే నాటికి అనేక మార్పులు రాబోతున్నట్లు మస్క్‌ (Elon Musk) తెలిపారు. పరోక్షంగా ఉద్యోగులకు తదుపరి లక్ష్యాలను కూడా నిర్దేశించారు.

అలాగే రానున్న రోజుల్లో యూట్యూబ్‌, లింక్డిన్‌ వంటి వాటికి కూడా ఎక్స్‌ (X) పోటీనిస్తుందని మస్క్‌ (Elon Musk) అన్నట్లు కంపెనీకి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ‘ఎక్స్‌వైర్‌’ పేరిట న్యూస్‌ వైర్‌ సర్వీసులను సైతం ప్రారంభించే యోచనలో ఉన్నామని చెప్పినట్లు సమాచారం. చైనాలోని ‘వీచాట్‌’ సూపర్‌యాప్‌ తరహాలో ‘ఎక్స్‌’ను సైతం ఒక ‘ఎవ్రీథింగ్‌ యాప్‌’గా మారుస్తామని గతంలోనూ మస్క్‌ (Elon Musk) అనేక సార్లు సంకేతాలిచ్చారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, రవాణా, హోటల్‌ బుకింగ్‌లు.. ఇలా అన్నింటినీ ఎక్స్‌ (X)లో భాగం చేయనున్నట్లు చెప్పారు. ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు కావాల్సిన అనుమతుల కోసం ప్రస్తుతం అమెరికాలో కంపెనీ ప్రక్రియ ప్రారంభించింది.

ఎక్స్‌ (X)లో ఆడియో, వీడియో ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు మస్క్‌ (Elon Musk) ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతానికి కొంతమంది యూజర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఫోన్‌ నెంబర్‌ అవసరం లేకుండా ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చని వివరించారు. ఎక్స్‌ (X)ను ‘ఎవ్రీథింగ్‌ యాప్‌’గా మార్చడంలో భాగంగానే ఈ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని