Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

ఇన్ఫీ నారాయణమూర్తి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మౌలిక సదుపాయాల రంగంలో మూడు షిఫ్టులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Updated : 30 Nov 2023 21:30 IST

బెంగళూరు: దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాలంటూ వ్యాఖ్యానించి చర్చకు దారితీసిన ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి (Narayana Murthy).. తాజాగా మరో కీలక సూచన చేశారు. మౌలిక సదుపాయాల రంగంలో మూడు షిఫ్టులు ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే చైనాను అధిగమించగలగమన్నారు. బెంగళూరులో బుధవారం రాత్రి నిర్వహించిన టెక్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, ఉచితాల గురించీ మాట్లాడారు.

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ మెట్రో, ఇతర మెట్రోలు పూర్తి చేయాలంటే ఇన్‌ఫ్రా రంగంలో మూడు షిఫ్టులు ఉండాలని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలతో పోటీ పడాలంటే 11 నుంచి 5 గంటల షిఫ్ట్‌ ఏమాత్రం సరిపోదన్నారు. కనీసం రెండు షిఫ్ట్‌లు అయినా ఉండాలన్నారు. అప్పుడే చైనా వంటి దేశాలను అధిగమించగలమని అభిప్రాయపడ్డారు. ఆ దిశలో అడ్డంకులు అధిగమించేందుకు పాలకులు సైతం చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. 

దేశంలో 200 బిలియన్‌ డాలర్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు జరుగుతుంటే ఒక్క బెంగళూరు నుంచే 35-37 శాతం వరకు సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు జరుగుతున్నాయని నారాయణమూర్తి అన్నారు. చాట్‌జీపీటీ వంటి టెక్నాలజీ వల్ల ముప్పు వాటిల్లనుందా అనే ప్రశ్నకు నారాయణ మూర్తి సమాధానమిస్తూ.. చక్రం నుంచి చాట్‌జీపీటీ వరకు ఆవిష్కరణలన్నీ జీవితాలను మెరుగుపరచడానికి, ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడతాయన్నారు. అది నిత్యం జరిగేదేనని అన్నారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకెళ్తేనే ఏ సంస్థకైనా మనుగడ సాధ్యమని చెప్పారు.

అధిక పన్నుల అంశం గురించీ ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడారు. భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశమని, బడుగు బలహీన వర్గాల వారి అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వాలకు ఆ మేర ఆర్థిక మద్దతు అవసరమని చెప్పారు. తాను ఉచితాలకు వ్యతిరేకం కాదన్నారు. అయితే, ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ వంటివి అందిస్తున్నప్పుడు.. ఆ మేర పాఠశాలల్లో హాజరు శాతం పెరిగిందా? లేదా? అనేది కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు