నవ లిమిటెడ్‌.. రుణ రహితం

ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Updated : 18 May 2024 01:40 IST

రూ.2,621 కోట్ల బకాయిల చెల్లింపు
త్రైమాసిక లాభం రూ.255.1 కోట్లు 
వాటాదార్లకు 200% డివిడెండ్‌
ఈనాడు - హైదరాబాద్‌

 అశ్విన్‌ దేవినేని

ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి రూ.3,955 కోట్ల ఆదాయంపై రూ.1,256 కోట్ల నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది. 2022-23తో పోల్చితే వార్షిక లాభం 2.8% పెరిగింది. నవ లిమిటెడ్‌కు ఆఫ్రికాలోని అనుబంధ సంస్థ అయిన ఎంసీఎల్‌ (మాంబా కాలరీస్‌ లిమిటెడ్‌), గత ఆర్థిక సంవత్సరంలో 314.4 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,621 కోట్లు) దీర్ఘకాలిక రుణాన్ని పూర్తిగా చెల్లించింది. దీంతో నవ లిమిటెడ్‌ రుణ రహిత కంపెనీగా మారింది. తద్వారా భవిష్యత్తులో ఎంసీఎల్‌ నుంచి మాతృ సంస్థ అయిన నవ లిమిటెడ్‌కు లాభాలు జమ అయ్యే అవకాశం కలుగుతోంది. వాటాదార్లకు 200% డివిడెండ్‌ (రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.4 చొప్పున) చెల్లించాలని యాజమాన్యం ప్రతిపాదించింది. 

మెరుగైన పనితీరు: నవ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ, నవ భారత్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ పనితీరు మెరుగుపడింది. ఈ సంస్థకు చెందిన 150 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ ఏడాది మొత్తం పనిచేసిన ఫలితంగా  రూ.115 కోట్ల పీబీటీ (పన్నుకు ముందు లాభం) నమోదైంది. ఫెర్రో అల్లాయ్స్‌ విభాగమూ మార్చి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించింది. మైనింగ్‌ విభాగం ఆదాయాలు 21.2%, పీబీటీ 165% పెరిగాయి.

గనుల తవ్వకాలు.. అవకాడో పెంపకం: ఎంసీఎల్‌ తన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనుంది. రెండో దశలో 300 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మించేందుకు అవసరమైన నిధుల సమీకరణ యత్నాలు చేపట్టింది. దీంతో పాటు జాంబియా సెంట్రల్‌ ప్రావిన్స్‌లో 323 హెక్టార్లలో మాగ్నటైట్‌ గని అభివృద్ధి చేసే అంశాన్ని ఎంసీఎల్‌ పరిశీలిస్తూ, గనుల తవ్వకం హక్కుల కోసం అక్కడ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. వచ్చే ఏడాది కాలంలో దీనికి సంబంధించిన వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసి, మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టాలని ఎంసీఎల్‌ భావిస్తోంది. మరొక అనుబంధ సంస్థ నవ అవకాడో లిమిటెడ్‌ దాదాపు 225 హెక్టార్లలో 75,000 అవకాడో మొక్కలు నాటింది. రెండు నెలల్లో మరో 20,000 మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్లాంటేషన్‌ నుంచి రెండేళ్లలో ఆదాయాలు వస్తాయని యాజమాన్యం ఆశిస్తోంది.

అన్ని విభాగాలు బాగున్నాయి: ఏకీకృత, స్టాండ్‌ అలోన్‌ స్థాయిలో పూర్తిగా అప్పు తీర్చేసి రుణ రహిత కంపెనీగా మారటం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నట్లు నవ లిమిటెడ్‌ సీఈఓ అశ్విన్‌ దేవినేని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల గడువు ఉన్నప్పటికీ ముందే బకాయిలు తీర్చడం వల్ల, దీర్ఘకాలంలో సత్ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. సంస్థలోని అన్ని వ్యాపార విభాగాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు