China Phones: చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీపై ఆరోపణలు.. స్పందించిన కేంద్రమంత్రి

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఫోన్‌లోని ఓ ఫీచర్‌ ద్వారా యూజర్ల డేటా సేకరిస్తోందని ఆరోపిస్తూ ఓ నెటిజన్‌ ట్వీట్ చేశారు. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి స్పందించారు. దీంతో చైనాకు చెందిన ఫోన్లలో డేటా భద్రతపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Published : 18 Jun 2023 19:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్ ఫోన్‌ (Mobile Phone) వినియోగదారుల్లో భారత దేశం (India) ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. కానీ, భారత్‌ మొబైల్‌ మార్కెట్‌లో చైనా కంపెనీలదే అధిక శాతం వాటా. అయితే, ఆ దేశ మొబైల్‌ కంపెనీలు తయారు చేసిన స్మార్ట్‌ఫోన్ల (Smart Phones) ద్వారా భారత్‌ సహా ఇతర దేశాల్లోని యూజర్ల డేటాను చైనా (China) సేకరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, అమ్మకాల పరంగా శాంసంగ్‌ ( Samsung) తర్వాత చైనాకు చెందిన షావోమి (Xiaomi), ఒప్పో (Oppo), వివో (Vivo), వన్‌ప్లస్‌ (OnePlus) ఫోన్లదే హవా. ఈ నేపథ్యంలో రియల్‌మీ (Relame) కంపెనీ ఫోన్‌లోని ఓ ఆప్షన్‌ ద్వారా యూజర్ల డేటాను సేకరిస్తుందని ఓ ట్విటర్‌ యూజర్‌ ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) స్పందించారు. ఈ విషయమై పూర్తి విచారణ చేపడతామని ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు డేటా భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

‘‘రియల్‌మీ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లలో యూజర్‌ డేటా (కాల్‌ లాగ్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌, లొకేషన్‌ ఇన్ఫో) సేకరించేందుకు ఎన్‌హ్యాన్స్‌డ్‌ ఇంటెలిజెంట్‌ సర్వీసెస్‌ (EIS) అనే ఫీచర్‌ ఉంది. ఫోన్‌ సెట్టింగ్స్‌లో అడిషన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్‌ సర్వీసెస్‌ అనే సెక్షన్‌ను ఓపెన్‌ చేస్తే ఈఐఎస్‌ కనిపిస్తుంది. అది ఎనేబుల్‌ చేసి ఉంటే యూజర్లకు తెలియకుండానే వారి సమాచారం సేకరిస్తున్నట్లు. అయితే, యూజర్  ప్రమేయం లేకుండానే ఈఐఎస్‌ ఎనేబుల్ కావడం బలవంతపు చర్య. దీని ద్వారా సేకరించిన డేటా చైనాకు వెళుతోందా?’’ అంటూ రిషి బాగ్రీ అనే నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ఇది చూసిన కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ‘ఈ ఫీచర్‌ను పరీక్షించి.. తనిఖీ చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఆరోపణలపై రియల్‌మీ స్పందించాల్సివుంది. 

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మాత్రం రియల్‌మీతోపాటు ఒప్పో ఫోన్లలో కూడా ఈ ఫీచర్‌ ఉందని, ఆ బ్రాండ్ ఫోన్ వాడుతున్న యూజర్ల డేటా కూడా సేకరించే అవకాశం ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్‌, వివో, ఐకూ వంటి బ్రాండ్‌లకు చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ మాతృ సంస్థగా ఉంది. దీంతో ఆయా కంపెనీలు సైతం యూజర్ల డేటా సేకరించే అవకాశంలేకపోలేదని యూజర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని