Toll fee: వాహనదారులకు ఊరట.. ఎన్నికల తర్వాతే కొత్త టోల్‌ ఛార్జీలు!

టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని NHAIకు ఈసీ సూచించింది. ఎన్నికల తర్వాతే పెంచిన రుసుములు వసూలు చేయాలని పేర్కొంది.

Published : 01 Apr 2024 20:46 IST

దిల్లీ: వాహనదారులకు ఊరట. టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ECI) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను (NHAI) ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యే వరకు పెంపును నిలుపుదల చేయాలని సూచించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వినతి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పాత ఛార్జీలే వసూలు చేయాలని ఈ మేరకు టోల్‌ ఆపరేటర్లకు ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. 

ఏటా ఏప్రిల్‌ 1న టోల్‌ రుసుం పెరుగుతుంది. ఈ పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. దీంతో పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపును వాయిదా వేయాలని ఈసీ సూచించింది. దీంతో ఆ మేర వసూలు చేసిన మొత్తాలను వాహనదారులకు వెనక్కి వేయనున్నట్లు NHAI వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 26 నుంచి జూన్‌ 1 వరకు పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో పెంపు అమల్లోకి వస్తుందా? సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తయ్యే వరకూ పాత ఛార్జీలే కొనసాగుతాయా అనే దాంట్లో స్పష్టత లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని